షార్ట్ సర్క్యూట్ తో ట్రాక్టర్ దగ్ధం

షార్ట్ సర్క్యూట్ తో ట్రాక్టర్ దగ్ధం

రూ.10లక్షల విలువైన ట్రాక్టర్ బుగ్గిపాలు
తనను ఆదుకోవాలని రైతు గగ్గోలు

కొత్తూరు, ఆంధ్రప్రభ : ట్రాక్టర్ పెట్టిన చోటే షార్ట్ సర్క్యూట్ తో ట్రాక్టర్ కు నిప్పంటుకుని కాలిబూడిదైన సంఘటన గురువారం కొత్తూరు మండలంలో చోటుచేసుకుంది. రైతు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు మండల పరిధిలోని కోడిచర్ల తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఖాజీగూడా తండాకు చెందిన శంకర్ నాయక్ గత 15 నెలల క్రితం షాద్ నగర్ పట్టణంలో ట్రాక్టర్ షో రూమ్ లో పవర్ ట్రాక్ ట్రాక్టర్ ను తన కొడుకు రాజేందర్ పేరుపై తన వద్ద ఉన్న కాస్త డబ్బులను డౌన్ పేమెంట్ చేసి మిగతా డబ్బులను ఫైనాన్స్ చేయించాడు.

ట్రాక్టర్ ను కొనుగోలు చేసిన శంకర్ నాయక్ గ్రామంలో తనకున్న కాస్త వ్యవసాయ పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోజూ మాదిరిగానే పనులు ముగించుకుని బుధవారం రాత్రి తన వ్యవసాయ పొలం వద్ద ట్రాక్టర్ ను పెట్టి ఇంటికి వెళ్ళాడు. యధావిధిగా మరుసటి రోజు ఉదయం పొలం వద్దకు శంకర్ నాయక్ వచ్చి చూసేసరికి ట్రాక్టర్ పూర్తిగా కాలిబూడిదైపోయింది. అది చూసిన శంకర్ నాయక్ విలవిల విలపించసాగాడు.

అరుపులు విన్న ఇరుగుపొరుగు రైతులు వచ్చి పరిశీలించేసరికి ట్రాక్టర్ కాలి బుగ్గిపాలైంది. ట్రాక్టర్ రాత్రి షార్ట్ సర్క్యూట్ తో ఇంజన్ ఆన్ అయ్యి ముందున్న ప్రీకాస్ట్ కడ్డీలకు ఢీకొని టైర్లు తిరిగి తిరిగి రాపిడి ఏర్పడి టైర్లలో మంటలు చెలరేగి ట్రాక్టర్ మొత్తానికి మంటలు వ్యాపించి ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైందని, ట్రాక్టర్ ను జీవనోపాధికోసం అప్పు చేసి, ఫైనాన్స్ చేసుకుని మరీ కొనుగోలు చేశానని రైతు బోరున విలపించాడు. జరిగిన ప్రమాదంపై అటు షోరూం వారిని, ఇటు ఫైనాన్స్ వారిని సంప్రదిస్తే కనీసం కనికరం లేకుండా మాట్లాడుతున్నారని ఆవేదనను వ్యక్తం చేశాడు.

ఈ ప్రమాదంపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేయనున్నట్లు రైతు శంకర్ నాయక్ తెలిపారు. కాగా నష్టపోయిన తనను అధికారులు, షోరూం వారు గానీ, ప్రజాప్రతినిధులు గానీ ఆదుకోవాలని బోరునవిలపించాడు.

Leave a Reply