ప్రపంచ స్థాయి న్యాయ నిపుణులను తీర్చిదిద్దే దిశగా

ప్రపంచ స్థాయి న్యాయ నిపుణులను తీర్చిదిద్దే దిశగా

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ విద్యారంగంలో చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో న్యాయవిద్యను అందించేందుకు ‘లీగల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ‘ది ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎట్ ఆంధ్రప్రదేశ్ యాక్ట్, 2025’కు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో ఈ యూనివ‌ర్సిటీ ఏర్పాటు కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

అక్టోబర్ 17న గవర్నర్ ఆమోదం పొందిన ఈ చట్టం ఈరోజు (అక్టోబర్ 28న) ఆంధ్రప్రదేశ్ గెజిట్‌లో ప్రచురించబడింది. గవర్నర్ ఆదేశాల మేరకు రాష్ట్ర న్యాయ కార్యదర్శి గొట్టాపు ప్రతిభా దేవి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ద్వారా రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాల న్యాయ విద్య అందించే విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో

ఈ యూనివర్సిటీని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. న్యాయ విద్య, పరిశోధన రంగాల్లో గ్లోబల్ స్టాండర్డ్స్‌ను తీసుకురావడం, విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగలిగేలా తీర్చిదిద్దడం ఈ విశ్వవిద్యాలయ లక్ష్యం.

ఈ యూనివర్సిటీ ప్రధానంగా న్యాయ విద్యలో అత్యుత్తమ ప్రమాణాలను స్థాపించడం, లీగల్ రీసెర్చ్‌ మరియు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, విదేశీ విద్యార్థులు మరియు పరిశోధకులను ఆకర్షించడం, అంతర్జాతీయ స్థాయి న్యాయ నిపుణులను తయారుచేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రతిష్ఠాత్మక సంస్థ

ఈ కొత్త యూనివర్సిటీ రాష్ట్ర విద్యా రంగంలో కొత్త దశను తెరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో న్యాయ విద్య అందించడమే కాకుండా, పరిశోధనలో కొత్త దారులు సృష్టించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, ఈ చట్టం అమలుతో ఆంధ్రప్రదేశ్‌ విద్యా రంగంలో మరో మైలురాయిగా నిలుస్తూ, దేశ వ్యాప్తంగా న్యాయ విద్యకు నూతన దిశను చూపనుంది.

Leave a Reply