Towards 2029 | రాజకీయ పునఃప్రయాణానికి సంకేతమా

Towards 2029 | జగన్ పాదయాత్రపై తాజా ప్రచారం: అధికారిక షెడ్యూల్ ఖరారైందా?
గత ప్రజాసంకల్ప యాత్ర: ఎప్పుడు ప్రారంభమైంది? ఎంతదూరం సాగింది?
2017–19 పాదయాత్రలో లేవనెత్తిన ప్రధాన ప్రజా సమస్యలు
2024 ఓటమి తర్వాత జగన్ మళ్లీ ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఎందుకు?
పాదయాత్ర అంటే నడక కాదు: కేడర్ రీబిల్డింగ్, రాజకీయ రీబ్రాండింగ్
జగన్ పాదయాత్రతో ఏపీ రాజకీయాల్లో మార్పులు వస్తాయా?
కూటమి ప్రభుత్వంపై జగన్ పాదయాత్ర ప్రభావం ఎంతవరకు?
రాజకీయ పునఃప్రారంభమా? లేక దీర్ఘకాల వ్యూహాత్మక ప్రయత్నమా?

Towards 2029
Towards 2029

Towards 2029 | ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో “పాదయాత్ర” పదం వినగానే ఠక్కున మనకు గుర్తుకొచ్చే పేరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్ర. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి తనయుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వై యెస్ జగన్ పాదయాత్ర. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చారిత్రాత్మక విజయం అందించిన ప్రధాన ఆయుధం.

2024 ఎన్నికల్లో కూటమి చేతిలో ఓటమి పాలైన తర్వాత, వైఎస్ జగన్ మరోసారి పాదయాత్రపై ఆలోచిస్తున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కానీ అసలు వాస్తవ పరిస్థితి ఏమిటి? ఈ పాదయాత్ర రాజకీయంగా ఏ మేరకు ప్రభావం చూపగలదు అనేవి ఏపీలో కొంత చర్చ నడుస్తోంది. ప్రస్తుతానికి అంటే 2026 ప్రారంభం నాటికి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టాలనుకుంటున్న పాదయాత్రకు అధికారిక షెడ్యూల్ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. వైఎస్సార్‌సీపీ నేతలు, పార్టీ వర్గాలు “ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమం” జరుగుతుందని పరోక్షంగా సంకేతాలిస్తున్నప్పటికీ, ఆ తేదీలు, ఏయే మార్గాలు, ఎంత వ్యవధి వంటి అంశాలపై స్పష్టత మాత్రం ఇంకా ఇవ్వలేదు.

అయితే, పార్టీ అంతర్గత సమావేశాలు, జిల్లాస్థాయి సమీక్షల్లో జగన్ “ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది” అన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం. అందుకే ఇది పూర్తి స్థాయి పాదయాత్ర కాకపోయినా, దీర్ఘకాలిక ప్రజా సంప్రదింపు కార్యక్రమంగా రూపుదిద్దుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ గత పాదయాత్ర ఎప్పుడు, అప్పట్లో ప్రజాసంకల్ప యాత్ర పేరుతో జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 2017 నవంబర్ 6న ఇడుపులపాయ (వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి) నుంచి ప్రారంభమై, 9 జనవరి 2019 న ముగిసింది.

సుమారు 430 రోజుల వ్యవధిలో సుమారు 3,648 కిలోమీటర్ల దూరం కొనసాగింది. : శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం లో ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, వేలాది గ్రామాలు ఈ పాదయాత్ర ద్వారా కవర్ అయ్యాయి. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ పాదయాత్రలలో ఒకటిగా నిలిచింది. ఆ సమయంలో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా, జగన్ పాదయాత్ర ప్రధానంగా ప్రజల్లో ఉన్న అసంతృప్తిని రాజకీయంగా అనుకూలంగా మలుచుకోవడానికి ఉపయోగపడింది. అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న అసంతృప్తి అంశాల్లో ముఖ్యమైనవి రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, రుణమాఫీ అమలు కాకపోవడం, నిరుద్యోగ సమస్య, ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యం, మహిళా భద్రత, పెరుగుతున్న ధరలు, పేదలకు ఇళ్లు, సంక్షేమ పథకాల లోపాలు.

జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలనను పోల్చి చూపుతూ, “నవరత్నాలు” అనే స్పష్టమైన ప్రత్యామ్నాయ పాలన మోడల్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇదే పాదయాత్రకు రాజకీయ బలం ఇచ్చింది. 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓటమి తర్వాత పార్టీ తీవ్ర ఆత్మపరిశీలనలో ఉంది. ముఖ్యంగా పార్టీ కేడర్ ఓటమి వల్ల డీమోరలైజ్ కావడం, ప్రజలతో నేరుగా సంబంధం తగ్గిపోవడం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా కూటమి వైపు వెళ్లడం, పార్టీ లోపల నాయకత్వంపై సందేహాలు, ఈ పరిస్థితుల్లో జగన్‌కు మళ్లీ ప్రజల్లోకి వెళ్లడం తప్పనిసరి.

పాదయాత్ర అంటే కేవలం నడక కాదు — అది కేడర్‌ను తిరిగి ఉత్తేజపరిచే సాధనం, ప్రజల నాడి తెలుసుకునే వేదిక, రాజకీయ రీబ్రాండింగ్‌కు మార్గం. అందుకే ప్రస్తుతం జగన్ పాదయాత్రను ఒక రాజకీయ “రిసెట్ బటన్”గా చూడవచ్చు.

జగన్ పాదయాత్రతో ఏపీలో రాజకీయాలు మారనున్నాయా? అంటే, తక్షణమే ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశాలైతే లేవనే చెప్పవచ్చు. కానీ కొన్ని ప్రభావాలు మాత్రం ఉండొచ్చు. అవేంటంటే, వైఎస్సార్‌సీపీ కేడర్‌లో చలనం, స్థానిక సమస్యలు మళ్లీ రాష్ట్ర రాజకీయ చర్చల్లోకి రావడం, కూటమి ప్రభుత్వంపై విమర్శలకు ప్రజా వేదిక, మీడియా, సోషల్ మీడియాలో జగన్ మళ్లీ కేంద్ర బిందువుగా మారడం. అయితే 2019లో లాగా ఒకే పాదయాత్రతో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోతుందన్న అంచనా మాత్రం వాస్తవికం కాదు.

ఎందుకంటే ఏపీ ప్రజలు ఇప్పుడు కూటమి సంక్షేమ పాలన ఫలితాలను ప్రత్యక్షంగా చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ప్రారంభ దశలోనే ఉంది. ఈ దశలో ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి స్థాయి వ్యతిరేకత/అనుకూలత ఏర్పడలేదు. అందుకే జగన్ పాదయాత్ర ప్రభుత్వ మనుగడను తక్షణమే కుదిపివేసే స్థాయికి చేరుతుందని చెప్పడం అతిశయోక్తి. కానీ, ప్రభుత్వ హామీల అమలు లోపాలు, ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలు పెరిగితే మాత్రం, జగన్ పాదయాత్ర వాటిని రాజకీయంగా మలుచుకునే అవకాశాలున్నాయి.. అది కూటమికి కొంత అసౌకర్యంగా మారవచ్చు.

జగన్ మళ్లీ పాదయాత్ర గురించి ఆలోచించడం రాజకీయంగా తిరిగి పునాదులు వేసుకునే ప్రయత్నంగా చూడవచ్చు. అయితే, 2017–19 పరిస్థితులు, 2026–28 పరిస్థితులు ఒకేలా లేవు. ప్రజల అంచనాలు మారాయి. రాజకీయ పోటీ తీవ్రత పెరిగింది. అందుకే ఈ పాదయాత్ర జగన్‌కు రాజకీయ పునఃప్రారంభానికి అవకాశం ఇవ్వొచ్చు గానీ, అది ప్రస్తుతానికి విజయానికి హామీ మాత్రం కాదు. ఫలితం పూర్తిగా జగన్ వ్యూహం, ప్రజల నమ్మకం, ప్రత్యామ్నాయ రాజకీయ దృక్పథంపై ఆధారపడి ఉంటుంది.

click here to read more

click here to read Former MP | ఈడీ విచార‌ణ‌..

Leave a Reply