Tournament | పాత సంప్రదాయానికి బైబై…

Tournament | పాత సంప్రదాయానికి బైబై…
- యువతను సంప్రదాయ క్రీడల వైపు మళ్లిస్తున్న పోలీసులు
Tournament | ఏలూరు, ఆంధ్రప్రభ బ్యూరో : సంక్రాంతి సందర్భంగా యువతను సంప్రదాయ క్రీడల వైపు మళ్లించేందుకు వాలీబాల్ టోర్నమెంట్‌ను భీమడోలు పోలీసులు, ప్రజలు నిర్వహించారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఆదేశాల మేరకు రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించు కొని యువతను జూదా క్రీడల నుంచి దూరంగా ఉంచేందుకు భీమడోలు మండలం పోలసానపల్లి గ్రామంలో ఈ టోర్నమెంట్ నిర్వహించారు.

జూద క్రీడలు వద్దు.. సంప్రదాయ క్రీడలే ముద్దు అనే నినాదంతో భీమడోలు ఎస్‌ఐ షేక్ మదీనా భాష ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించారు. మండల పరిధిలోని ఎనిమిది గ్రామాలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్, భీమడోలు సీఐ యుజే.విల్సన్ ముఖ్య అతిథులుగా హాజరై టోర్నమెంట్‌ను అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ పేరుతో జరిగే కోడిపందేలు, పేకాట వంటి జూదా క్రీడలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని, వారు క్రీడల వైపు మళ్లితే ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ, ఐక్యత పెరుగుతాయని తెలిపారు.

