Top Story | ట్రాఫిక్ క్లియర్​! ఫ్లై ఓవర్​తో తీరనున్న ఐటీ కారిడార్‌ కష్టాలు

సెంట్రల్​ డెస్క్​, ఆంధ్రప్రభ : ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతంలో అతి పెద్ద ఫ్లై ఓవ‌ర్‌ నిర్మించేందుకు సిద్ధమైంది. ఇది ట్రిపుల్‌ ఐటీ చౌరస్తా, కోకాపేట ఓఆర్ఆర్‌ చౌరస్తా మధ్య రానుంది. ఈ వంతెనను తెలంగాణ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ఆధ్వర్యంలో నిర్మించనున్నారు. దీని నిర్మాణానికి సర్వే పనులు మొద‌ల‌య్యాయి. వరద వ్యవస్థ, వాహన రద్దీ, నేల స్వభావం, ఇతర పరీక్షలకు కన్సల్టెన్సీని ఆహ్వానిస్తూ టెండర్ నోటిఫికేషన్‌ సైతం జారీ చేసింది.

మూడు నెల‌ల పాటు అధ్య‌య‌నం..

3 నెలల పాటు అధ్యయనం చేసి, తర్వాతి రెండున్నరేళ్లలో ఫ్లై ఓవ‌ర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని టీజీఐఐసీ లక్ష్యంగా పెట్టుకుంది. వంతెన నిర్మాణ పనులు పూర్తయితే హైద‌రాబాద్ సిటీలో రెండో పొడవైన ఫ్లై ఓవ‌ర్‌గా నిలుస్తుంది. ట్రిపుల్‌ ఐటీ చౌరస్తా నుంచి కోకాపేట (జీఏఆర్‌ చౌరస్తా) వరకు లక్షకు పైగా వాహనాలు రోజూ రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం ఆరు వరుసల రహదారి మార్గం అందుబాటులో ఉన్నా, ట్రిపుల్‌ ఐటీ, విప్రో, ఐసీఐసీఐ, సియంట్‌ కూడళ్లలో వాహనాలు పెద్ద ఎత్తున‌ నిలిచిపోతున్నాయి.

మెయిన్ సెంట‌ర్ల‌లో స్కై వేలు..

ఈ ప్రాంతంలో ఐటీ సంస్థల పనివేళలు ఒకేలా ఉండటంతో ఉదయం, సాయంత్రం ఆయా కూడళ్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. వర్షం వస్తే ప‌రిస్థితి దారుణంగా మారుతోంది. ఓఆర్‌ఆర్‌ నుంచి గచ్చిబౌలి వరకు ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో రహదారిని అభివృద్ధి చేయాలని టీజీఐఐసీ నిర్ణయించుకుంది. రోడ్డును విస్తరించి, ఫుట్‌పాత్‌లు, కేబుల్‌ వైర్ల కోసం డక్ట్‌లు, కూడళ్లలో స్కై వాక్‌వేలు అందుబాటులోకి రానున్నాయి.

ఎవరికి ఉపయోగం అంటే..

నల్లగండ్ల, గోపన్‌పల్లి, గౌలిదొడ్డి ప్రాంతాల నుంచి విప్రో చౌరస్తా మీదుగా నియో పొలిస్, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని ఐటీ సంస్థలకు వెళ్లే వాహనదారులకు. ఈ ఫ్లై ఓవ‌ర్ ఎంతో ఉప‌యోగంగా మార‌నుంది. నిజాంపేట, మియాపూర్, హఫీజ్‌పేట, కొండాపూర్, గచ్చిబౌలి, డీఎల్‌ఎఫ్‌ తదితర ప్రాంతాల నుంచి ట్రిపుల్‌ ఐటీ కూడలి మీదుగా నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు వెళ్లే ఐటీ ఉద్యోగులకు కూడా ట్రాఫిక్ క‌ష్టాలు త‌ప్ప‌నున్నాయి. ఆయా ప్రాంతాల వారు మెయిన్ సెంట‌ర్ల వ‌ద్ద‌ ఆగకుండా ఫ్లై ఓవ‌ర్ మీదుగా ఆఫీసుల‌కు ఈజీగా చేరుకోవచ్చు.

సిగ్నల్‌ రహిత సెంట‌ర్‌గా ట్రిపుల్‌ ఐటీ చౌరస్తా

నాలుగు రోడ్లను కలిపే ట్రిపుల్‌ ఐటీ చౌరస్తాను సిగ్నల్‌ రహిత కూడలిగా తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ పనులను చేపట్టింది. ఈ జంక్ష‌న్‌లో రెండు ఫ్లై ఓవ‌ర్‌లు, రెండు అండర్‌పాస్‌లను నిర్మిస్తోంది. విప్రో చౌరస్తా, ఐసీఐసీఐ బ్యాంకు చౌరస్తాల్లోనూ ఫ్లై ఓవ‌ర్‌లు, అండర్‌ పాస్‌లు నిర్మిస్తామని జీహెచ్‌ఎంసీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని ఐటీ సంస్థలకు 30 ఏళ్ల పాటు ట్రాఫిక్‌ కష్టాలు తలెత్తకుండా పొడవైన ఫ్లై ఓవ‌ర్ నిర్మాణానికి టీజీఐఐసీ ముందడుగు వేసింది. ఈ ఫ్లై ఓవ‌ర్‌ నిర్మాణం వ్యయం అంచనా ₹700 కోట్లుగా ఉండగా.. దీని పొడవు 5 కిలోమీటర్లు, 24 మీటర్ల వెడల్పుతో ఫ్లై ఓవర్​ నిర్మాణం జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *