ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఆ పది మంది ఎమ్మెల్యేల్లో ఆందోళన
న్యాయపోరాటం చేస్తున్న బీఆర్ఎస్
క్లైమాక్స్‌కు చేరనున్న ఫిరాయింపు కథ
విప్ జారీ చేస్తే చిక్కుల్లో ఫిరాయింపుదారులు
కాంగ్రెస్ ఖాతాలో మూడు, బీఆర్ఎస్ ఖాతాలో ఒకటి
ఆ ఒక్క సీటుకే దక్కెదవరికో?
ఎంఐఎం అడిగితే కాంగ్రెస్ తగ్గాల్సిందేనా
బీజేపీకి నో చాన్స్.. మద్దతు ఇచ్చేది ఎవరికో
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :
ఎమ్మెల్యే కోటాలోని అయిదు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల అయ్యింది. ఎన్నడూ లేని విధంగా ఈసారి జరిగే ఎన్నికల్లో అన్ని పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరిగింది. ప్రస్తుతం ఏర్పడిన ఖాళీల్లో మూడు కాంగ్రెస్ ఖాతాలోకి, ఒకటి బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. అయితే.. మిగిలిన ఒక్క సీటు కోసం మాత్రమే పోటీ అనివార్యంగా ఉండనుంది. ఇక.. ఆ సీటు దక్కించుకోవడానికి కాంగ్రెస్ తీవ్ర యత్నం చేస్తోంది. ఫిరాయింపుదారులు, ఎంఐఎం మద్దతు తీసుకుంటే ఆ సీటు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లే చాన్స్ ఉంది. బీఆర్ఎస్ విప్ జారీ చేసినా ఫిరాయింపుదారులు కాంగ్రెస్‌కు మద్దతిస్తే పదవి పోవడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్‌తో జతకట్టి ఉన్నప్పటికీ ఎంఐఎం కోరితే కాంగ్రెస్ ఒక సీటు జార విడుచుకోవాలి. బీజేపీ విషయానికి వస్తే.. వారికి ఉన్న బలం మేరకు పోటీ చేసే అవకాశం లేదు. అయితే.. ఎవరికో ఒకరికి మద్దతివ్వాలి. కేంద్రంలో విపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు మద్దతిచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఇస్తే బీఆర్ఎస్ ఆరోపించినట్లు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డితో అంటకాగుతున్నారన్న ఆరోపణలు నిజమవుతాయి. బీఆర్ఎస్‌కు మద్దతిస్తే పెద్దగా రాజకీయ విమర్శలు ఎదుర్కో అవసరం లేదు. ఎందుకంటే ప్రాంతీయపార్టీలతో అంటకాగుతున్న బీజేపీ అందుకు వ్యతిరేకం కాదని నిరూపించుకునే అవకాశం ఉంది.
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇదీ లెక్క..
అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు మార్చిలో నోటిఫికేషన్ రానున్నది. అసెంబ్లీలో 119 స్థానాలున్నాయి. ఇందులో కాంగ్రెస్‌కు 64 మంది ఎమ్మెల్యేలుండగా, కంటోన్నెంట్ ఎమ్మెల్యే లాస్య మృతి కారణంగా జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ బలం 65కి చేరింది. అలాగే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 39 ఉండగా.. ఎమ్మెల్యే లాస్య మృతితో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ సీటు కోల్పోవడంతో ప్రస్తుతం బీఆర్ఎస్ సంఖ్య 38కి చేరింది. ఇందులో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్‌కు 28 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నట్లు లెక్క. అలాగే ఎంఐఎంకి ఏడుగురు ఎమ్మెల్యేలు, బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్నారు. ఇక.. ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కించుకోవడం కోసం 20 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. కాంగ్రెస్ సునాయాసంగా మూడు సీట్లు దక్కించుకుంటుంది. అలాగే బీఆర్ఎస్ కూడా ఒక సీటు దక్కించుకుంటుంది. మిగిలిన ఒక్క సీటు కోసం పోటీ పడాల్సి ఉంటుంది. అయితే.. కాంగ్రెస్‌కు మిగిలింది ఐదుగురు, ఫిరాయింపుదారులు పది మంది, బీఆర్ఎస్‌కు ఎనిమిది మంది, బీజేపీకి ఎనిమిది మంది, ఎంఐఎంకి ఏడుగురు ఉన్నారు. ఒక్కవేళ కాంగ్రెస్ ఆ ఒక్క సీటు దక్కించుకోవాలంటే కాంగ్రెస్, ఫిరాయింపుదారులు, ఎంఐఎం కలిస్తే ఆ సీటు కాంగ్రెస్ ఖాతాలోకి వెళుతుంది. ఒకవేళ ఎంఐఎం కూడా ఎమ్మెల్సీ స్థానం కోరితే కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ పదవి కోల్పోవలసి ఉంటుంది.
బీఆర్ఎస్ ఎత్తుగడ ఏమిటో?
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎత్తుగడ ఏంటన్నది తెలియడం లేదు. ఈ విషయంపైనే అంతా చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించే కంటే ఫిరాయింపుదారులపై వేటు వేయడానికి వినియోగించుకునే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన పది మంది పదవులను ఊడగొట్టడమే ధ్యేయంగా బీఆర్ఎస్ ముందుకు వెళుతుంది. ఇందులో భాగంగా న్యాయపోరాటం కూడా చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఓ మంచి వేదికగా తీసుకుని ఆ పది మంది ఎమ్మెల్యేల పదవులు ఊడగొట్టడానికే ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనిపలువురు భావిస్తున్నారు. బీఆర్ఎస్ విప్ జారీ చేస్తే ఫిరాయింపుదారులు చిక్కుల్లో పడే అవకాశం ఉంది.
పది మంది ఎమ్మెల్యేల్లో టెన్షన్..
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పది మంది ఎమ్మెల్యేల్లో టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఫిరాయింపుదారులపై అవిశ్రాంతి పోరాటం చేస్తోంది. ఈ కేసు సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ప్రస్తుతం విచారణలో ఉంది. అయితే.. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీలో విప్ జారీ చేస్తే.. ధిక్కరించేవారికి పదవి పోవడం ఖాయం. ఒక వేళ పదవి పోతే ఉప ఎన్నికల్లో నెగ్గుతామో లేదో అనేది అనుమానమే. కాంగ్రెస్ కూడా మండలిలో బలం సంపాదించుకోవడం కోసమే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్పించుకుందని పలువురు భావిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటు వేయకపోతే తమ రాజకీయ పరిస్థితి ఏమిటనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. ముందుకు వెళితే నుయ్యి.. వెనక్కు వస్తే గొయ్యి అనే పరిస్థితులో ఆ పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి మారిపోయింది.
క్లైమాక్స్‌కు చేరనున్న ఫిరాయింపు కథ..
ఫిరాయింపులదారుల కథ క్లైమెక్స్‌కు చేరనుందని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే ప్రజాక్షేత్రంలో ఈ పది మంది ఎమ్మెల్యేల కోసం ఎండగడుతున్న బీఆర్ఎస్, మరో వైపు న్యాయపోరాటం చేస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో బీఆర్ఎస్ విప్ జారీ చేయడం ఖాయం. ఇలాంటి సమయంలో విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై వేటు పడుతుంది. మూడు రకాల పోరాటాలతో బీఆర్ఎస్ ముందుకు వెళితే ఫిరాయింపుదారుల కథ క్లైమాక్స్ చేరుతుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు.