కృతివెన్ను మండలమే ప్రత్యక్ష సాక్షి
ఇంతేరులో పాగావేసిన ఫిష్ కింగ్స్
లీడర్ల చేతుల్లో వేలాది ఎకరాల భూములు
ఇందులో అధికార పార్టీ లీడర్లకు అతిపెద్ద వాటా
ఉప్పు ఉత్పత్తి మాటున భూముల పందేరం
అడుగడుగునా వీర జవాన్లకు ఆటంకాలు
ముప్పు తిప్పలు పెడుతున్న అధికారులు
నీరుగారిన ఉప్పు ఉత్పత్తి.. తీరంలో ఉత్తుత్తి పహారా
సహజ సంపద దోపిడీకి బ్రేక్ వేసేది ఎవరు?
బోర్డర్లలో శత్రుమూకలకు పరాక్రమవంతులు
సొంతూళ్లో మాత్రం లీడర్ల వెన్నుపొటు..
ఆందోళన చెందుతున్న విశ్రాంత సైనికులు
ఇంతేరు.. ఇది కృష్ణా జిల్లాలోని ఓ చిన్న గ్రామం.. కృత్తివెన్ను మండలంలోని సాగర తీరంలోని ఆ ఊరు ఇప్పుడు ఫిష్ కింగ్స్ చేతిలో బందీ అయ్యింది. ఈ ఫిష్ కింగ్స్‌కు కూటమి పార్టీల లీడర్లు, మంత్రులు అండగా నిలవడంతో వారి ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఆ ఊరి జనాభా 1300 మంది మాత్రమే.. కేవలం 350 మత్స్యాకార కుటుంబాలుంటాయి. వారి జీవనాధారం అంతా వేటమీద ఆధారడి ఉంది. సముద్రంలో చేపలు దొరికితే ఇల్లు గడిచేది. లేకపోతే పస్తులే. కానీ, ఈ ఊరంతా చేపల మాఫియా హస్తగతమైంది. ఇక మాజీ సైనికుల పేరిట లీడర్లు చేసే దందా అంతా ఇంతా కాదు.. వారికి తహసీల్దార్ బూమి రాసిస్తే.. దాన్ని లోకల్‌గా ఉండే రైతులతో కాస్తు చేపించి.. ఆక్రమించేస్తున్న తీరు దారుణంగా ఉంది. దీన్ని ప్రశ్నించే వారు లేరు.. నిలదీసి అడిగేవారు లేక సిఫాయిలు తమకు ఎదురైన పరాభవాన్ని పంటిబిగువన భరిస్తున్నారు..
ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఆర్ఎస్ నెంబర్ 94.. ఇది కృష్ణాజిల్లా సాగర తీరం ఇంతేరు గ్రామంలోని భూమి చిరునామా. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని 2000 ఎకరాల ఉప్పునీటి భూమి. ఈ భూమి ప్రస్తుతం ఫిష్ మాఫియా సామ్రాజ్యంలోని కింగ్స్ చెరలో ఉంది. దీంట్లో మాజీ ఎంపీలు.. మాజీ మంత్రుల వాట ఎక్కువే. ఈ భూమిని కాపాడాల్సిన కేంద్ర ఉప్పు ఉత్పత్తి సంస్థ ఉత్తుత్తి పహారాలో నీరు గారింది. మాజీ సైనికులకు నజరానాగా ఇచ్చిన 700 ఎకరాల భూమీ మాయమైంది. ఇప్పుడు అక్కడ రొయ్యల రాజుల పాలన సాగుతోంది. ఆక్రమణలను అడ్డుకోవటానికి అధికారులు వెళ్తే.. ఈ ఊరి మత్స్యకారులను ఆక్వామాఫియా రంగంలోకి దించుంతోంది. దీంతో ఏమీ చేయలేక అధికారులు తిరిగి వచ్చేస్తున్నారు. ఇరవై ఏళ్లుగా ఇక్కడ ఇదే తంతు కొనసాగుతోంది.
ప్రభుత్వ శాఖలన్నీ.. జీ హుజూర్
కృష్ణాజిల్లా సాగర తీరంలోని 94 .9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మడ అడవులే ఎక్కువగా ఉంటాయి.. ప్రకృతి ప్రసాదించిన వరం. కృత్తివెన్ను మండలం నుంచి నాగాయలంక వరకూ ఈ మడ అడవులు .. ఉప్పెన, తుపానుల నుంచి రక్షిస్తాయి. కానీ, ఈ కథ కబ్జా కంచికి చేరింది. వేలాది ఎకరాల్లో ఫిష్ మాఫియా సామ్రాజ్యం విస్తరించింది. ఈ క్రమంలో ఉప్పు కొఠారులకూ రక్షణ కరువైంది. కృత్తివెన్ను మండలంలో ఇంతేరు, చినపాండ్రాక గ్రామాల్లో ఉప్పు నీటి పర్రలన్నింటిలోనూ నల్ల దొరలు పాగా వేశారు. ఇంతేరు గ్రామంలో కబ్జాలు ప్రత్యేకం. ఈ ఊరు రొయ్యల రాజ్యంగా మారిపోయింది. నిజంగా ఇక్కడి మత్స్యకారులకు జీవనోపాధిని పెంచితే పర్వాలేదు. కానీ పల్లెకారుల పేరిట ఫిష్ కింగ్స్ భూముల్ని, రెవెన్యూ శాఖకే కాదు… అటవీశాఖను, చివరికి విద్యుత్తు శాఖనూ తమ ఆధీనంలోకి గుంజుకున్నారు. ఈ స్థితిలో అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చేష్టలుడిగి.. నీరుగారి పోయాయి.
రెక్కలు విరిగిన పవన విద్యుత్తు ప్రాజెక్టు..
2009లో కృష్ణపట్నం ఓడరేవుకు ఏపీ ప్రభుత్వ భూమిని అప్పగించిన తరుణంలో.. ఇంతేరులోని 1000 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం బదిలీ చేసింది. ఆ తర్వాత 2014లో ఈ తీరంలో పవన విద్యుత్తు ప్రాజెక్టు నిర్మిస్తే ఎలా ఉంటుందని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచించారు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదన చేశారు. కానీచ ఇక్కడ తుపానుల ప్రభావం ఉంటుందని చెప్పిన చేపలమాఫియా మాటలను ప్రభుత్వం నమ్మేసింది. ఏపీ ఆధీనంలోకి వచ్చిన భూమిపై ఆక్వా మాఫియా కన్నుపడింది. ప్రజా ప్రతినిధులను రంగంలోకి దించింది. ఇంతేరు ప్రజలకు రంగుల కల చూపింది. 50 ఎకరాల చెరువుతో ఊరి జనాన్ని ఊరించింది. చేపల వేటలో అర్ధాకలితో అల్లాడే జనం చెరువుకే యజమానిగా మారితే.. ఆ ఊరు పల్లెకారులు సంతోషించారు. అక్రమ చెరువులకు సహకరించారు. ఐతే, ఆక్రమణలని ఆ ఊరి జనానికి తెలీదు. ఇంకేముందీ.. ప్రభుత్వాలు మారుతుంటే.. కొత్త నాయకులు తెరమీదకు వచ్చారు. ఇంతేరులోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భూముల్ని కొల్లగొట్టారు. అధికారులు వస్తే.. పల్లెకారులు ఎగబడే రీతిలో ఫిష్ కింగ్స్ మాఫియా తన సామ్రాజ్యాన్ని విస్తరించింది. ముఖ్యంగా ఐదేళ్లల్లో ఆక్రమణల పర్వం స్పీడుగా సాగింది. ఇంతేరు, పార్వతీపురం మధ్య సముద్ర తీరానికి కేవలం 500 మీటర్ల దూరంలోనే ఓ మాజీ మంత్రి 200 ఎకరాలను హస్తగతం చేసుకున్నారు. ఇక చేపల మాఫియా నుంచి ఎకరానికి ₹10,000లు చొప్సున కప్పం వసూలు చేశారని గతంలో మాజీ మంత్రిపై వసూళ్ల కథలు మార్మోగాయి.
సైనికులకు దెబ్బ మీద దెబ్బ
సహజంగా సరిహద్దులో అహర్నిశలు పనిచేసిన సైనికుడు జై జవాన్ పాత్ర నుంచి జైకిసాన్ పాత్రకు మారే రీతిలో కేంద్ర ప్రభుత్వం.. మాజీ సైనికుడికి సాగు భూమి ఇస్తోంది. ఎక్కడ ఖాళీ జాగా ఉంటే.. అక్కడ భూమి ఇస్తోంది. ఏపీలో రెవెన్యూశాఖ సైనికులతో ఆటలు షురూ చేసింది. సాగుకుపనికి రాని రాళ్లు , రప్పలు, ఉప్పు నీటి పర్రల్లో పట్టాలు ఇచ్చేశారు. ఆ పట్టా తీసుకుని సైనికుడు ఆ భూమి దగ్గరికి వెళ్తే.. అక్కడ మరో వ్యక్తి కనిపిస్తాడు. ఎన్నోఏళ్లుగా సాగుచేస్తున్న తన భూమిని ఆర్మీ జవానుకు ఎలా ఇస్తారని, ఇస్తే నేనెందుకు వైదొలగాలని ఎదురు ప్రశ్నిస్తాడు. మళ్లీ ఆ సైనికుడు తాహసీల్దారు చుట్టూ తిరిగి తిరిగి కాళ్లరిగి.. ఇంట్లో కూలపడటం సర్వసాధారణం. ఇక ఆయన కాలం చేస్తే.. వారసులు కాళ్లకు బలపం కట్టుకుని మళ్లీ తాహసీల్తారు కార్యాలయం ఎదుట ప్రత్యక్షం అవుతారు. కానీ, ఆ భూమి మాత్రం వారికి లభించదు. ఇక కేంద్ర ప్రభుత్వ భూమిని ఆక్రమించిన కబ్జారాజు పేరు మాత్రం అడంగల్‌లో నమోదు అవుతుంది. సైనికుడి వారసుడికి ఆ అవకాశం లేదు. ఇంతేరులోని దాదాపు 700 ఎకరాల్లో ఇదే కథ అందరికీ రిపీట్ అవుతూనే ఉంది..
ఉత్తుత్తి పహరా ఎన్నాళ్లు..
రెవెన్యూ అధికారులు ఫిష్ కింగ్స్‌కి లొంగిపోవడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది.. అయితే.. సెంట్రల్ సాల్ట్ ఇండస్ట్రీ అధికారుల జాడ కనపడటం లేదు. ఏడాది కిందట వరకూ ఇంతేరు, పాండ్రాకల్లో కనిపించిన అధికారి.. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో? తెలియటం లేదు. పెదపట్నం, ఇంతేరు, చినపాండ్రాక, మంగినపూడిలో ప్రత్యక్షమయ్యే ఆ అధికారి… విధుల్లో ఉన్నారా? లేరా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా, ప్రస్తుతం ఇంతేరులో ఉప్పునీటి పర్రలోకూ ఆక్రమణ జాడ్యం పట్టింది. వందల ఎకరాల్లో రొయ్యల చెరువులు ప్రత్యక్షం అవుతున్నాయి. వీటిని కట్టడిచేసే ఉప్పు ఉత్పత్తి మండలి అదృశ్యం కావటం.. వెనుక కథేంటీ? ఇక విద్యుత్తు శాఖ మామూళ్ల పర్వంలో పరవశించిపోతోంది. ఓ సామాన్యుడి ఇంటికి మీటర్ ఇవ్వటానికి నానా తిప్పలు పెట్టే విద్యుత్తుశాఖ .. సాగర తీరంలో కిలోమీటర్ల కొద్దీ విద్యుత్తు స్థంభాలను, ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేసింది. తాజాగా ఎవ్వరు కప్పం కడితే.. ఆ చెరువు విద్యుత్తు దీపాలతో వెలిగిపోతుంది. ఇది సరే.. కాలుష్యనియంత్రణ మండలి ఎక్కడ? ఇలా ఎన్ని ప్రశ్నలు చెలరేగినా.. అధికార యంత్రాంగం మాత్రం మామూళ్ల టచ్చింగ్ మత్తులో జోగుతున్నారనేది జనం ఆరోపణ.