Top Story | క్రాప్‌ స‌ర్వేలో ఎర్ర‌ర్స్‌! పంట‌ల స‌మాచారం అప్‌లోడ్ కావ‌ట్లే

డిజిట‌ల్ స‌ర్వేకు టెక్నిక‌ల్ ఇష్యూస్
స్మార్ట్‌ఫోన్ యాప్‌లో ఆటంకాలు
త‌ర‌చూ త‌లెత్తుతున్న సాంకేతిక స‌మ‌స్య‌లు
స‌ర్వే పూర్త‌యితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు
పంట‌ల బీమా, ప్ర‌కృతి వైఫ‌రీత్యాల‌ప్పుడు మేలు
క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ఫొటోలు తీస్తున్న సిబ్బంది
యాప్‌లో అప్‌లోడ్ చేస్తుంటే ఆల‌స్యం
సేవ్ కావ‌డానికి చాలా టైమ్ ప‌డుతుంద‌ని ఆవేద‌న‌
కొన్ని ప్రాంతాల్లో నెట్‌వ‌ర్క్ స‌మ‌స్య‌లు
క‌చ్చిత‌మైన వివ‌రాలు ఇవ్వాల్సిందే అంటున్న అధికారులు

సెంట్రల్​ డెస్క్​, ఆంధ్రప్రభ: పంటల సాగును కచ్చితంగా లెక్కించేందుకు ప్రభుత్వం చేపట్టిన డిజిటల్‌ పంటల సర్వే రాష్ట్రంలోని ఆయా జిల్లాలో ప్రారంభమైంది. మొదటి విడతగా జిల్లాలోని మండలాల వారీగా వ్యవసాయ విస్తరణాధికారి క్లస్టర్‌ పరిధిలోని రెండు వేల ఎకరాలకు మించి ఉన్న గ్రామాన్ని సర్వే చేపట్టాల్సి ఉంది. దీనికి ఉపయోగించే స్మార్ట్‌ఫోన్‌ యాప్‌లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటం సిబ్బందికి ఇబ్బందిగా మారిందని వ్యవసాయశాఖ విస్తరణాధికారులు అంటున్నారు. సర్వే సకాలంలో పూర్తికావడంపై అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

ప్రయోజనాలు అనేకం ..

ఆన్‌లైన్‌లో పంటల వివరాల నమోదుతో అనేక ప్రయోజనాలు క‌ల‌గ‌నున్నాయి. పంటల బీమాతో పాటు ప్రకృతి వైపరీత్యాలతో జరిగే పంట నష్టాన్ని అంచనా వేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. వ్యవసాయ రంగంలో డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (డీపీఐ) రూపొందించే లక్ష్యంతో డిజిటల్‌ అగ్రిమిషన్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రైతులకు ప్రయోజనం చేకూరేందుకు, వ్యవసాయ సామర్థ్యాన్ని పెంచడానికి, ఆధునిక సాంకేతికతను పెంచేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.

ఆదిలోనే ఆటంకాలు..

స్మార్ట్‌ఫోన్ యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటం సంబంధిత అధికారులకు తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. జిల్లా భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా వాగులు, వంకలు దాటుకుంటూ పొలాల దగ్గరకు వెళ్లాల్సి వస్తోంది. తీరా వెళ్లిన తర్వాత అక్కడ సెల్‌ఫోన్ సిగ్న‌ల్స్‌ సమస్య తలెత్తడం, ఒక సర్వే నంబరు దగ్గర వేరే రైతుల వివరాలు చూపించడం వంటివి యాప్‌లో ఏర్పడుతున్నాయి. కాగా, పంట వివరాలను నమోదు చేసి ఫొటో తీసిన తర్వాత సేవ్ చేయడానికి చాలా సమయం పడుతున్న‌ట్టు తెలుస్తోంది. ఒక్కోసారి మొబైల్ సైతం ఆగిపోతుండటంతో ఈ సర్వేలో ఆటంకంగా మారుతుందని సిబ్బంది తెలిపారు. రైతుల సహాయం తీసుకోకుండా, రెవెన్యూ సిబ్బంది ఎవరూ లేకుండా వ్యవసాయ శాఖ సిబ్బందే సర్వే చేపట్టడం, సర్వేతో పాటు రోజు వారీగా చేసే పనులు ఉండటం ఇంకాస్త ఇబ్బందిగా ఉందని సంబంధిత అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కచ్చితమైన వివరాలు..

డిజిటల్‌ పంటల సర్వే చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక స్మార్ట్ యాప్‌ను రూపొందించింది. ఎంపిక చేసిన గ్రామాల్లో వ్యవసాయ భూముల సర్వే నెంబరు, ఉప సర్వే నెంబర్ల వారీగా పంటల వివరాలు, ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. వ్యవసాయాధికారులు ప్రతి పంట పొలాన్ని సందర్శించి కచ్చితమైన వివరాలను యాప్‌లో ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో త‌లెత్తుతున్న టెక్నిక‌ల్ ఎర్ర‌ర్స్‌తో స‌ర్వే కాస్త లేట్ అవుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *