Tirupathi | గోవుల మరణాలపై అసత్యాలు .. వైసిపి నేత భూమనపై కేసు నమోదు

తిరుపతి ‍ ‍- టిటిడి మాజీ ఛైర్మన్, వైసిపి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఎస్వీ గోశాలలో గోవుల మృతిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ధర్మకర్తల మండలి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు టిటిడి బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి నేడు ఫిర్యాదు చేశారు. ఎస్వీ గోశాలలో 100 గోవులు మరణించాయని.. పవిత్రమైన గోశాలను గోవధ శాలగా మార్చారంటూ కరుణాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని భాను ప్రకాష్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు చేసిన ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా భానుప్రకాశ్ మీడియాతో మాట్లాడుతూ, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహరించారు. ఎస్వీ గోశాలపై అసత్య ప్రచారం చేశారు. వైకాపా హయాంలో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా బయట పెట్టాం. కరుణాకర్ రెడ్డి మాత్రం నోరు ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఆయన ఛైర్మన్‌గా ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో గోవులు చనిపోయాయి. వైకాపా హయాంలో పురుగులు పట్టిన ఆహారాన్ని గోవులకు పెట్టారు. గోవిందుడు, గోవులతో ఆటలు వద్దని వైకాపా నేతలను హెచ్చరిస్తున్నాం. టిడిడి లో అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ కొనసాగుతోంది అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *