యధాస్థితికి వచ్చేంత వరకు..

భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : తుఫాను కారణంగా జరిగిన ప్రతి నష్టాన్ని ఖచ్చితంగా అంచనా వేయాలని.. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. తుఫాను అనంతరం పరిస్థితుల పై తీసుకోవలసిన చర్యలు, జాగ్రత్తల పై గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా రెవెన్యూ అధికారి(District Revenue Officer), రెవిన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు ఇలా అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ.. “మొంథా తుపాను” వల్ల జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తుగా పూర్తి సన్నదతతో 24 గంటలు అహర్నిశలు పని చేసారన్నారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామ సచివాలయ అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి(District Collector Chadalavada Nagarani) కృతజ్ఞతలు తెలియజేశారు. పశ్చిమ జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేసి ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఎదుర్కొంటారన్న గుర్తింపు ఉందన్నారు.

” మొంథా తుపాను”ను ఎదుర్కొనేందుకు తీసుకున్న ముందస్తు చర్యల ద్వారా జిల్లాలో ఎటువంటి నష్టం జరగకుండా బయటపడి మనం నిరూపించుకున్నామన్నారు. ఇదే లక్ష్యంతో తుఫాను అనంతరం పరిస్థితులు యధాస్థితికి వచ్చేంత వరకు అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి సేవలు అందించాలన్నారు.

సాయంత్రానికి తుఫాను ప్రభావిత గ్రామాలలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ(Electricity Department) అధికారులు ఆదేశించారు. రోడ్లపై, ఇళ్లపై నేలకొరిగిన చెట్లను ఇంకనూ తొలగించకపోతే తక్షణమే తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు.

తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ముంపు ప్రాంతాలలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యవసర సరుకులైన 25 కేజీల బియ్యం(25 kg rice), కందిపప్పు, పంచదార, బంగాళదుంపలు, నూనె, ఉల్లిపాయలు కిట్ల ద్వారా తక్షణమే పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అలాగే మత్స్యకార, చేనేత కార్మికుల కుటుంబాలకు 50 కేజీల చొప్పున బియ్యాన్ని, నిత్యవసర వస్తువుల కిట్లను అందజేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పునరావాస కేంద్రాల్లోని ప్రతి కుటుంబానికి రూ.3 వేలు, కుటుంబంలో ఒక్కరే ఉంటే రూ.1,000 చొప్పున(rice at Rs.1,000) ఆర్థిక సహాయం అందజేయాలన్నారు.

తుఫాను ప్రభావిత ప్రాంతాలలో తుఫాను నష్ట వివరాలను వెంటనే సేకరించి నివేదికలు సమర్పించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాబోయే రెండు, మూడు రోజులలో జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాలు యధాస్థితికి వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి(District Joint Collector T.Rahul Kumar Reddy), డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, రెవిన్యూ డివిజనల్ అధికారులు కె. ప్రవీణ్ కుమార్ రెడ్డి, దాసిరాజు, ఖతిబ్ కౌసర్ భానో, డిపిఓ ఎం.రామనాథరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply