వైజాగ్ వన్డేకు కట్టుదిట్టమైన బందోబస్తు….

  • ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్..

ఆంధ్రప్రభ, విశాఖపట్నం : ఐ.డి.ఎఫ్.సి ఫస్ట్ బ్యాంక్ సిరీస్ లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య వైజాగ్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం జ‌ర‌గ‌బోయే మూడు వ‌న్డేకు అన్ని ఏర్పాట్లు పూర్తిస్థాయిలో పూర్తి చేయ‌టం జ‌రిగింద‌ని ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు కేశినేని శివ‌నాథ్ అన్నారు.

శ‌నివారం వైజాగ్ క్రికెట్ స్టేడియంలో జ‌ర‌గ‌బోయే మ్యాచ్ కి సంబంధించిన ఏర్పాట్లును ఏసీఏ సెక్ర‌ట‌రీ సానా స‌తీష్‌, వైస్ ప్రెసిడెంట్ , ఏసీఏ వైస్ ప్రెసిడెంట్ బండారు న‌ర‌సింహారావు, కోశాధికారి దండ‌మూడి శ్రీనివాసరావు, ఏసీఏ కౌన్సిలర్ విష్ణు దంతు, ఏసీఏ స్టేడియం చైర్మ‌న్ ప్ర‌శాంత్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సి.వో.వో గిరీష్ డోంగ్రే, ఏసీఏ సి.ఎ.వో జై కిష‌న్ ల‌తో శుక్ర‌వారం సాయంత్రం ఎంపీ కేశినేని శివ‌నాథ్ ప‌రిశీలించారు.

స్టేడియం మొత్తం తిరిగి ఏర్పాట్లును స్వ‌యంగా స‌మీక్షించారు. పోలీస్ అధికారుల‌తో మాట్లాడి భ‌ద్ర‌త ప‌రంగా తీసుకుంటున్న జాగ్ర‌త్తలు తెలుసుకోవ‌టంతో పాటు త‌గు సూచ‌నలు, స‌ల‌హాలు అందించారు. స్టేడియం లోపల, వెలుపల ఏర్పాట్లను క్షుణ్ణంగా పర్యవేక్షించారు.

ప్రేక్షకులకు అవసరమైన తాగునీరు, శౌచాలయాలు, వైద్య సౌకర్యాలతోపాటు అగ్నిమాపక భద్రత వంటి కనీస వసతులు సరిగా ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు. వీఐపీ, వీవీఐపీ గ్యాలరీలు, ప్రముఖుల రాకపోకలు, వారి భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు.

మ్యాచ్ నిర్వహణలో పాల్గొనే ఏసీఏ సిబ్బంది, ఇతర ఏజెన్సీలు , పోలీసు యంత్రాంగం మధ్య పూర్తి సమన్వయం ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.

కట్టుదిట్టమైన పోలీసు భద్రత విశాఖపట్నంలో జరగనున్న క్రికెట్ మ్యాచ్‌ను విజయవంతంగా, ఒక పండ‌గ వాతావ‌రంణంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన‌ట్లు ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివ‌నాథ్ తెలిపారు.

ఈ సమగ్ర ఏర్పాట్లు మ్యాచ్‌ను చూసేందుకు వచ్చే వేలాది మంది క్రీడాభిమానులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన అనుభవాన్ని అందిస్తాయని స్ప‌ష్టం చేశారు.

Leave a Reply