పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు

  • వేడుకలు ఆమోదయోగ్యం, ఆహ్లాదకరంగా..
  • మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు
  • విజయవాడ పోలీస్ కమీషనర్ ఎస్. వి రాజశేఖర్ బాబు..

ఆంధ్రప్రభ, విజయవాడ : ఎన్‌టీఆర్ జిల్లా నగర ప్రజలకు, పోలీస్ సిబ్బంది, అధికారులకు ఎన్‌టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ డిసెంబర్ 31 రాత్రి నిర్వహించుకునే వేడుకల సందర్భంగా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని కొన్ని ఆంక్షలు విధించడం తప్పనిసరి అయ్యిందని ఆయన తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సహకరించాల‌ని సూచించారు.

నగర ప్రజలకు పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేశారు. అర్ధరాత్రి రోడ్డుపై వేడుకలు నిర్వహించేందుకు అనుమతి లేదని, వాహనాలు నడుపుతున్న వ్యక్తులు అతివేగంగా లేదా అజాగ్రత్తగా వాహనాలు నడపరాదని తెలిపారు. ట్రిపుల్ రైడింగ్‌, మద్యం సేవించి వాహనాలు నడపడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. డిసెంబర్ 31 రాత్రి ప్రధాన రహదారులైన బందర్ రోడ్, ఏలూరు రోడ్, బీఆర్‌టీఎస్ రోడ్లపై పూర్తిస్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తామని తెలిపారు.

అలాగే బెంజ్ సర్కిల్ (కొత్త, పాత) ఫ్లైఓవర్లు, కనకదుర్గ ఫ్లైఓవర్‌లపై ట్రాఫిక్‌కు అనుమతి ఉండదన్నారు. గుంపులుగా చేరి నడిరోడ్డుపై కేక్‌లు కట్ చేయడం, అల్లర్లు సృష్టించడం, రాత్రివేళ కేకలు వేస్తూ వాహనాలపై తిరగడం వంటివి చేయరాదని హెచ్చరించారు. హద్దు మీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.

డిసెంబర్ 31 రాత్రివేళ నగరమంతటా గస్తీ ముమ్మరంగా కొనసాగుతుందని సీపీ వెల్లడించారు. మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తొలగించి అధిక శబ్దాలతో తిరగడం, అతివేగంగా రోడ్లపై దూసుకెళ్లడం, వాహనాలు నడుపుతూ విన్యాసాలు ప్రదర్శించడం, బాణాసంచా పేల్చడం వంటి చర్యల వల్ల ప్రజల ప్రశాంతతకు భంగం కలిగి వృద్ధులు, చిన్నపిల్లలు, రోగులకు ఇబ్బందులు కలుగుతాయని పేర్కొన్నారు.

నూతన సంవత్సర వేడుకలను ఆహ్లాదకర వాతావరణంలో, రోడ్డు ప్రమాదాలకు దూరంగా, ఇతరులకు ఇబ్బందులు కలగకుండా జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు నగర ప్రజలను కోరారు.

Leave a Reply