చోరీ కేసులో భలే చిక్కారు
అమ్మమ్మ..నాయనమ్మ.. నడుమ మనవరాలు
తీర్థయాత్ర వలతో రూ.8లక్షల సొత్తు చోరీ
గుడివాడ రూరల్ పోలీసులకు చిక్కారు
(ఆంధ్రప్రభ, గుడివాడ)
ఎనలేని ప్రేమ.. స్నేహం నటించి.. ఇంటిలో సొత్తును కొల్లగొట్టే లేడీ త్రీ ఇడియట్స్ కథకు గుడివాడ రూరల్ పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఈ ముగ్గురు చోరీ గుమ్మలకు అరదండలు వేసి జైలుకు పంపించారు. కృష్ణాజిల్లా గుడివాడ రూరల్ మండలం లక్ష్మీ నగర్ కాలనీలో ఇటీవల జరిగిన ఈ చోరీ కేసును నాలుగు రోజుల వ్యవధిలోనే పోలీసులు చేధించారు.
నిందితులు చోరీ చేసిన సొత్తును పోలీసులు మీడియా ముందు ప్రదర్శించారు. ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన ఎస్ఐ చంటిబాబును, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించి, రివార్డులను అందజేశారు. గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో డీఎస్పీ వీసా ధీరజ్ వినీల్ ఈ కేసు వివరాలను వెల్లడించారు.
విజయవాడకు చెందిన రాగ మాధురి తన అమ్మమ్మ రాజేశ్వరి, నాయనమ్మ రమావతితో కలిసి త్రీ ఈడియట్స్ చోరీ ముఠాను ఏర్పాటు చేసింది. తొలుత ఖాళీగా ఉన్న సంపన్న ఇంటిని ఎంచుకుంటారు. అడ్వాన్స్ చెల్లిస్తారు. ఇక ఇంట్లో చేరిన తరువాత రెక్కీ స్టార్ట్ చేస్తారు. ఏ విధంగా చోరీ చేయవచ్చో ప్లాన్ చేసుకుంటారు. గుడివాడ రూరల్ మండలంలోని లక్ష్మీ నగర్ కాలనీలో శేషు కుమారి అనే మహిళ ఇంటిలో ఖాళీగా ఉన్న వాటాలో అద్దెకు దిగటానికి ప్లాన్ వేశారు. రూ.7వేలు అడ్వాన్స్ ఇచ్చారు.
ఆ తరువాత రూ.3వేలు చెల్లించారు. ఇక ఇక్కడి నుంచే కథ ప్రారంభమైంది. అందరూ ఆడోళ్లే. మగాళ్లు లేరు. మంచి మాటలతో .. సాయం చేస్తూ శేషుకుమారిని ఆకట్టుకున్నారు. ఆమెను అన్ని విధాల నమ్మించారు. షిరిడి తీర్థయాత్రల పేరుతో వల వేశారు. తొలుత చిన్న తిరుపతికి తీసుకువెళ్లారు. అక్కడ దర్శనం బాగా జరిగింది. ఇక షిర్డికి వెళ్లే రైలు టిక్కెట్లు బుక్ చేసినట్టు శేషు కుమారిని నమ్మించారు. విజయవాడ వెళ్లిన తరువాత రూట్ మార్చారు.
శేషుకుమారిని ఏమార్చారు. కారులో గుడివాడకు వచ్చిన ఈ ముఠా నాగలక్ష్మి ఇంటి తాళాలు పగల కొట్టి, బీరువాలో నగలు, పట్టుచీరెలు ఎత్తేశారు. తీర్థయాత్రలకు తీసుకెళ్లి తిరిగి ఇంటికి చేరే లోపు శేషుకుమారి ఇంట్లో చోరీకి పథకం అమలు చేశారు. ఈ ముగ్గురూ యజమాని ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలు దొంగిలించారు. ఆగస్టు 30న బాధితురాలు శేషు కుమారి గుడివాడ రూరల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, ఎస్ ఐ చంటిబాబు చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి ఈ త్రీఈడియట్స్ ను పట్టుకున్నారు.
నిందితుల నుంచి సుమారు రూ.8 లక్షలు విలువ చేసే 71.04 గ్రాముల బంగారం, 327 గ్రాముల వెండి, విలువైన పట్టు చీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మహిళా దొంగలముఠాపై ఇప్పటికే చిలకలపూడి పోలీసు స్టేషన్ లో రెండు చీటింగ్ కేసులు, విజయవాడ సూర్యారావుపేట పోలీసు స్టేషన్ లో ఒక కేసు ఉన్నాయి. ఇక లక్ష్మీనగర్ కేసును చాకచక్యంగా చేధించిన గుడివాడ రూరల్ పోలీసులను జిల్లా ఎస్పీ గంగాధరరావు, డీఎస్పీ ధీరజ్ వినిల్ అభినందించారు.

