ఇదీ హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ ర‌హ‌దారి దుస్థితి

ఇదీ హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ ర‌హ‌దారి దుస్థితి

చిట్యాల, ఆంధ్రప్రభ : విజ‌య‌వాడ‌-హైద‌రాబాద్ జాతీయ ర‌హ‌దారి.. నిత్యం ర‌ద్దీగా ఉండే దారి.. అయితే ఎప్పుడు ఎక్క‌డ ట్రాఫిక్ జామ్ అవుతుందో తెలియ‌ని ప‌రిస్థితి.. ఈ ర‌హ‌దారిలో చిట్యాల వ‌ద్ద చిన్న‌పాటి వ‌ర్షం ప‌డినా గంట‌ల‌కొల‌ది వాహ‌నాలు నిలిచిపోయి బారులు తీరుతాయి. చిట్యాల మండల కేంద్రంలోని రైల్వే అండ‌ర్‌ బ్రిడ్జి(Railway Under Bridge) వద్ద వ‌ర్ష‌పు నీరు నిలిచిపోవ‌డంతో వాహ‌న రాక‌పోక‌ల‌కు అంత‌రాయం క‌లుగుతుంది. హైవే పక్కనే పోతురాజు కుంటను మున్సిపల్ అధికారులు చెత్తాచెదారంతో నింపడం, కబ్జాదారులు కుంటను ఆక్రమించడంతో చుక్కనీరు కూడా కుంటలో ఆగకుండా బ్రిడ్జి కింద నుండి ప్రవహిస్తుంది.

వర్షం ప‌డిన‌ప్పుడు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో బ్రిడ్జి కింద నీరు నిలవడంతో గంటలపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్(traffic jam) అయింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై చిట్యాల రైల్వే బ్రిడ్జి వద్ద వర్షాలకు తరచూ నీరు నిలబడుతున్న ప్రదేశాన్ని ఎస్పీ శరత్ చంద్ర పవార్(SP Sarath Chandra Pawar) పరిశీలించారు. నీరు ఎక్కడి నుండి వచ్చి నిలుస్తుంది అన్న విషయాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీరు నిలవకుండా తీసుకోవలసిన జాగ్రత్త పై పలు సూచనలు చేశారు.

వర్షాల వల్ల చిట్యాల పట్టణం నుండి వచ్చే వరద నీటిని అంతా పోతురాజు కుంటలోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటామని నల్లగొండ ఆర్డీవో అశోక్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన కూడా రైల్వే బ్రిడ్జిని పరిశీలించారు. నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి భవిష్యత్తులో జాతీయ రహదారిపై వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తుఫాన్ ప్రభావం(Cyclone Impact)తో కురిసిన వర్షాల వల్ల నిలిచిన నీటిని మున్సిపల్ అధికారులు, ఎన్‌డీఆర్ఎఫ్‌(NDRF), ఫైర్ సిబ్బందితో కలిసి సహాయక చర్యలను వేగవంతం చేసి కొద్ది సమయంలోనే వాహనాల రాకపోకల‌ను పున‌రుద్ధ‌రిస్తున్నామ‌న్నారు.

నేషనల్ హైవే, మున్సిపల్, ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఎన్ హెచ్ 65 పై తరుచూ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని బీజేపీ నాయకుడు, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు సంజయ్ ఆరోపించారు. పోతురాజు కుంట(Poturaju Kunta)ను కబ్జారాయుల నుండి కాపాడి వర్షపు నీరు అందులోకి మళ్లిస్తేనే రైల్వే బ్రిడ్జి కింద నీరు నిలిచే అవకాశం లేకుండా ఉంటుందని చెప్పారు.

అధికారులు అలసత్వాన్ని వీడి చిట్యాల రైల్వే బ్రిడ్జి వద్ద నీరు నిలిచే సమస్యను పరిష్కరించాలని మాజీ సర్పంచ్ జిట్ట నగేష్(Jitta Nagesh) డిమాండ్ చేశారు. పోతురాజు కుంట ను కబ్జారాయుళ్ల బారి నుంచి కాపాడాలని కోరారు. మున్సిపల్ అధికారులు కుంటలో చెత్తాచెదారాన్ని వేయకుండా డంపింగ్ యార్డ్ ను వేరే చోటకు తరలించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply