గంభీరావుపేట, (ఆంధ్రప్రభ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుమార్తె వివాహానికి హాజరై భావోద్వేగానికి గురయ్యారు. గంభీరావుపేట మండలంలోని నర్మాల గ్రామానికి చెందిన నవిత వివాహానికి ఆహ్వానం అందుకున్న ఆయన, నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ ఇది తనకు ఒక ప్రత్యేక అనుభూతి అని అన్నారు.
నవిత తండ్రి ధ్యానబోయిన నర్సింలు బీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి పనిచేస్తూ కరోనా మహమ్మారిలో మరణించగా, ఆమె అన్న నరేష్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. మరణానంతరం నరేష్ తన అవయవాలను ‘జీవన్‌దాన్’కు దానం చేసి ఆదర్శంగా నిలిచాడు.
తండ్రి, అన్నయ్య ఇద్దరినీ కోల్పోయిన కుటుంబంలో పెళ్లి జరగబోతుండగా, తన పెళ్లికి తండ్రి–అన్నయ్య లేని లోటు తీర్చాలని కేటీఆర్‌ను ఆహ్వానిస్తూ నవిత ప్రత్యేక అభ్యర్థన చేసింది.
ఆహ్వానం అందుకున్న కేటీఆర్ హాజరై, “ఇది కేవలం పెళ్లి ఆహ్వానం కాదు, నాపై ఉంచిన నమ్మకం. ఒక అన్నయ్యపై పెట్టుకున్న విశ్వాసం. ఆ కోరికను గౌరవించడం నా కర్తవ్యం,” అని అన్నారు. ప్రజలతో తన అనుబంధం రాజకీయాలకు అతీతమని, ఇలాంటి సంఘటనలు ‘మనం ఒకే కుటుంబం’ అనే బంధాన్ని గుర్తు చేస్తాయని పేర్కొన్నారు.
నవిత, సంజయ్ దంపతుల కొత్త జీవితం ఆనందంగా సాగాలని ఆశీర్వదించిన కేటీఆర్, “ఆ కుటుంబానికి మాత్రమే కాదు, పార్టీని నమ్ముకున్న ప్రతి కుటుంబానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది” అని హామీ ఇచ్చారు.