కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ముడా స్కామ్ వ్యవహారంలో ఊరట లభించింది. ముడా ఇళ్ల స్థలాల కేసును సీబీఐకి అప్పగించాలని మైసూరు సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేస్తూ.. సంచలన తీర్పును వెలువరించింది. కాగా, లోకాయుక్త ముడా స్కామ్‌లో పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయలేదని, కాబట్టి ఈ కేసును సీబీఐకి అప్పగించాలని స్నేహమయి కృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. కేసు ఇరు పక్షాల వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ఎం.నాగప్రసన్న గత నెల 28న తీర్పు రిజర్వు చేశారు.
పిటిషన్ వేసిన వ్యక్తికి దర్యాప్తు సంస్థను ఎంపిక చేసే హక్కు లేదని ధర్మాసనం పేర్కొంది. అయితే, పిటిషనర్ తరఫు న్యాయవాది రాజకీయ ఒత్తిడితో దర్యాప్తు పక్కదారి పట్టించవచ్చని ఆరోపించారు. నిజానిజాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ దర్యాప్తు అనివార్యమని కోరారు. మరోవైపు సీఎం తరఫు న్యాయవాది కపిల్ సిబల్ అన్ని కేసులను సీబీఐకి అప్పగించాలనడం సరికాదని కోర్టుకు తెలిపారు. ఇలా అయితే లోకాయుక్త పని చేయడం ఎందుకని వాదనలు వినిపించారు.
లోకాయుక్త పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటారని అంటున్నారని, సీబీఐ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న సీబీఐ స్వతంత్ర దర్యాప్తు సంస్థ కాదని తెలిపారు. లోకాయుక్త దర్యాప్తు స్వతంత్రంగా ఉంటుందని కబిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ముడా కేసును సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది.