ఈ భూపతి ఇక కార్పొరేట్ అంబాసిడార్

మైనింగ్ కంపెనీ భారీ ఆఫర్


(ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్) : నలబై నాలుగేళ్లు దండకారణ్యం సాక్షిగా… తాడిత పీడిత జనం కోసం.. దోపిడీదారుల గుండెల్లో తుపాకీ ఎక్కు పెట్టి సమసమాజ నిర్మాణం కోసం.. కొండల్లో.. కోనల్లో.. వాగుల్లో.. వంకల్లో కాళ్ల కింద ముళ్లు.. పాపరేళ్లను లెక్కచేయక.. విప్లవం వర్థిల్లాలి, అని నినదించిన ఈ మల్లోజుల నవీన రూపాంతరంపై చర్చ తీవ్ర స్థాయికి చేరింది. రెడ్ కారిడార్ ఆబుజ్ మడ్ ఇక కరెన్సీ కారిడార్ గా మారబోతోంది. కమ్యూనిజం (Communism) పునాదిపై కమర్షియలిజం భవంతి రూపుదిద్దుకుంటోంది. ఔను.. ఏ జీవవైవిధ్యం రక్షణ కోసం.. అమాయక గిరిజనంతో కలసి తూటాలు పేల్చి దండకారణ్య పరిరక్షకుడి పాత్ర పోషించి.. కార్పొరేట్ల గుండెల్లో అలజడి రేపిన.. అప్పటి మావోయిస్టు వేణుగోపాలుడు భుజాన తుపాకీ వీడి.. ఇక వన సంహారం బాధ్యతను మోస్తాడట.

రెండు రోజుల కిందట సర్కారు కాళ్ల కింద లొంగిన ఈ మాజీ మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల రావు (Mallojula Venugopala Rao) అలియాస్ భూపతికి మహారాష్ట్ర గడ్చిరోలి ప్రాంతంలోని ఒక మైనింగ్ కంపెనీ భారీ ఉద్యోగం ఆఫర్ చేసింది. లాయడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం గడ్చిరోలి అడవిలో ఐరన్ ఓర్ మైనింగ్ చేసింది. మావోయిస్టుల తాకిడితో తీవ్రంగా ఇనుప ఖనిజ గనికి తాళం వేసింది. ఫలితంగా తీవ్ర నష్టాన్ని చవిచూసింది.

తాజాగా ఈ కంపెనీ మల్లోజుల సహా లొంగిపోయిన 61మందికి భారీ ఉద్యోగాల ఆఫర్ ఇచ్చినట్టు జాతీయ మీడియా కొక్కొరోకో అంటోంది. ఆ కంపెనీ బ్రాండ్ ఎంబాసిడర్ గా మల్లోజులకు ఉద్యోగం ఇస్తానని కంపెనీ ప్రకటించింది. మహారాష్ట్ర సూరజ గడ్ (Maharashtra Surajgad) ప్రాంతంలో లాయడ్స్ కంపెనీ ఐరన్ ఓర్ మైనింగ్ జరుపుతోంది. ఇక్కడ ఒక ఇంటెగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. భారతదేశంలో లాయడ్స్ అనేది అతిపెద్ద ఇనుప ఖనిజం గనిని నిర్వహిస్తూ ఉంది. మల్లోజులతో పాటు 61మంది మావోయిస్టులు ఆయుధాలను వదిలేసి జనజీవనంలోకి రావడం కొత్త ఉషోదయమని, ఈ సందేశం జిల్లా మొత్తం వ్యాప్తి చేయాలని చెబుతూ దీనికోసం లొంగిపోయిన మావోయిస్టులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకరన్ ఆఫర్ ఇచ్చారట. ఇప్పటికే ఈ కంపెనీలో 71మంది మాజీ మావోయిస్టులు పనిచేస్తున్నారు. అదేవిధంగా సుదూర గిరిజన ప్రాంతాలకు చెందిన 1400 మంది పనిచేస్తున్నారని ఎండీ చెప్పారు. మావోయిస్టుల కారణంగా ఈ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేసేందుకు సెక్యూరిటీ దళాలు చాలా కష్టపడ్డాయని ఆయన వివరించారు.

లొంగిపోయిన మావోయిస్టుల విద్యార్హతలు, నైపుణ్యం ఆధారంగా లాయడ్స్ మైనింగ్ కంపెనీ (Lloyds Mining Company) లో ఉద్యోగాలు ఇస్తాం. ముఖ్యంగా భూపతి సామర్థ్యం బట్టి మంచి ఉద్యోగాలే ఇస్తాం, అని ప్రభాకరన్ చెప్పినట్లు జాతీయ మీడియా ప్రచారం చేస్తోంది. లొంగిపోయిన మావోయిస్టులు ఒక ఏడాది పాటు రీ ఇంటెగ్రేషన్ శిక్షణ పొందుతారు. తర్వాత ఒక ఏజన్సీ గుర్తింపు కార్డులను, బ్యాంక్ అకౌంట్లను తనిఖీ చేస్తుంది. ఆ పైన వీరికి ఉద్యోగాలు లభిస్తాయి.గచ్చిరోలి ప్రాంతంలో పనిచేయడం ఈ కంపెనీకి అంత సులభం కాదు. అందుకే మాజీ మావోయిస్టులకు ఉపాధి కల్పించి రంగంలోకి దించాలని లాయిడ్ వ్యూహం.

2013లో మావోెయిస్టులు ఇదే కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ని చంపేశారు, మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమంలో మాట్లాడుతూ, గచ్చిరోలి ప్రాంతాభివృద్ధికి రూ. 3 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ చెప్పారు. గచ్చిరోలి ప్రాంతాన్ని భారతదేశంలోని తొలి ‘గ్రీన్ స్టీల్ హబ్ ’ అవుతుందని ఆయనే చెప్పారు.ఈ కార్యక్రమంలో ఫడ్నవీస్ లొంగిపోయిన మల్లోజులతో కరచాలనం చేశారు. ఈ లొంగుబాటు ఒక అభివృద్ధిలో ఒక మైలు రాయి అని వర్ణించారు. మధ్యభారతంలో రెడ్ కారిడార్ ముగిసినట్టే . ఇంతకీ మల్లోజులకు దక్కిన ఆరు కోట్లు ఎవ్వరి తల వెలలు.. ఇప్పటి వరకూ ఎన్ కౌంటర్లలో చనిపోయిన నంభాల, సుధాకర్.. ఇలా చనిపోయినోళ్ల మావోయిస్టుల తల నజరానాల మొత్తం కలిపి .. మల్లోజులకు దక్కాయా? అని సామాన్య జనం ప్రశ్నించటం విశేషం.

Leave a Reply