భీమ్‌గల్ లో హస్తం పాగా..

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : మున్సిపల్ రెండో విడుత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పట్టణంపై పట్టు సాధించింది. గత పది సంవత్సరాలుగా భీమ్‌గల్ పట్టణం బీఆర్ఎస్ కు కంచు కోటల నిలిచింది.రెండు సార్లు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి లీడ్ అందించడం తో పాటు విజయం సమాకూర్చిన ఘనత భీమ్‌గల్ కు ఉంది. తనను ఆదరించి విజయం అందించిన భీంగల్ ప్రాంతం పై కూడ అంతే ప్రేమను పెంచుకున్న ఎమ్మెల్యే పట్టణాభివృద్ధికి అంతే సహకారం అందించి అభివృద్ధి చేశారు.
బీఆర్ఎస్ కు పట్టున్న భీమ్‌గల్ ప్రాంతం పై ఎలాగైనా పట్టు సాధించాలనే టార్గెట్ పెట్టుకున్న అధికార పార్టీ కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికలను ఛాలెంజ్ గా స్వీకరించింది. దానికి తోడు భీమ్‌గల్ ప్రాంతం రహత్ నగర్ గ్రామానికి చెందిన పీసీసీ చీఫ్ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం మున్సిపల్ ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకోవడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల ప్రారంభం నుండి బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్, సహకార సంఘాల రాష్ట్ర చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, మినరల్ డెవోలోప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట్ అన్వేష్ రెడ్డి తో పాటు ఇతర నాయకులు ఎన్నికల ప్రారంభం నుండి ముగిసే వరకు ఇక్కడే ఉన్నారు.
భారి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ లను రప్పించి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లను ఏర్పాటు చేశారు. వీరితో భీమ్‌గల్ అభివృద్ధి విషయం లో కాంగ్రెస్ పార్టీ అనుసరించే విధానాలను ప్రజలకు వివరించి ఓటుకు బ్యాంకు ను అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం లో విజయం సాధించారు. పట్టణం లోని 12 వార్డు స్థానాలను కైవసం చేసుకుని క్లీన్ చేయడంతో మున్సిపల్ పై కాంగ్రెస్ జండా ఎగురవేస్తామని ధీమా తో ఉన్న నాయకులు బీఆర్ఎస్ కంచు కోటను బద్దలు కొట్టి 12 వార్డుల్లో ఎనిమిది స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ జండాను ఎగురవేయనున్నారు.
