Water| శుద్ధ జలం పై చిత్తశుద్ధి శూన్యం

Water| శుద్ధ జలం పై చిత్తశుద్ధి శూన్యం
- పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్ల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం
- ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేయని ఆర్వో ప్లాంట్లు
- తాగునీటికై విద్యార్థుల పలు పాట్లు
- 32 మండలాల్లో 1,16,788 మంది విద్యార్థుల కష్టాలు
శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : మానవ జీవనానికి నీరు అత్యవసరం. రోజువారీ శరీర శ్రమ, వయసు, వాతావరణ పరిస్థితులను బట్టి ప్రతి వ్యక్తి తగినమేర తాగునీరు తీసుకోవాల్సిందే. లేకపోతే డీహైడ్రేషన్, జీర్ణాశయ సమస్యలు, ముఖ్యంగా కిడ్నీ సంబంధిత వ్యాధులు రావడం సాధారణం. ఈ ఆరోగ్యపరమైన అవగాహన పట్టణాల్లో కొంత ఉన్నా, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పెద్దలు, పిల్లలు ఇద్దరికీ తాగునీటి ప్రాముఖ్యతపై సరైన అవగాహన చాలాసార్లు ఉండదు అందరికీ విదితమే. ఇలాంటి నేపథ్యంలో గత ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు మీద ప్రత్యేక దృష్టి పెట్టింది.
ప్రతి ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలకు తగిన నిధులు కేటాయించి.. మంచి సామర్థ్యం ఉన్న ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ప్రధానంగా 100 మంది విద్యార్థులు ఉంటే రూ.25 వేల నుంచి, రూ. 70 వేల వరకు వ్యయం చేసి ఆర్వో ప్లాంట్ లు పెట్టారు. అదేవిధంగా 100 నుంచి 300 మంది విద్యార్థులు ఉంటే రూ. 1.84 లక్షలు, 300 నుంచి 500 మంది ఉంటే రూ. 4.84 లక్షలు, అదేవిధంగా 500 మందికి పైబడి ఉంటే రూ. 5.20లక్షలు వ్యయం చేసి జిల్లావ్యాప్తంగా 796 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటిలో 582 ఆర్వో ప్లాంట్లు మరుమతులకు వచ్చినట్లు సమాచారం. కాగా.. గత ప్రభుత్వం చర్యతో వేలాది విద్యార్థులకు నాణ్యమైన, శుద్ధమైన తాగునీరు అందుబాటులోకి వచ్చింది.

చాలాకాలం తర్వాత విద్యార్థులు తాగునీటి సమస్యల నుంచి వెసులుబాటు పొందారు. పాఠశాలకు వచ్చిన తరువాత పిల్లలు రోజంతా ఆరోగ్యంగా ఉండాలని, చదువుపై దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులూ, తల్లిదండ్రులూ ఆశించారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితి మారాల్సిన సమయంలో పూర్తిగా భిన్న దిశగా వెళుతోంది. గత 18 నెలలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి పాఠశాలల్లో నెలకొన్న సమస్యల్లో చాలా వాటికి పరిష్కారం దొరకడమే కాక.. ఇప్పటికే ఉన్న సదుపాయాలు కూడా శిథిలావస్థకు చేరుతున్నాయి. అందులో ముఖ్యంగా ఆర్వో ప్లాంట్ల నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యం ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
పనిచేయని ఆర్వో ప్లాంట్లు..
జిల్లావ్యాప్తంగా సుమారు 2వేలకు పైగా పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు అమర్చినప్పటికీ.. ప్రస్తుతం వాటిలో గణనీయమైన శాతం పనిచేయకుండా పాడైపోయిన స్థితికి చేరినట్లు తెలుస్తోంది. ఎక్కువ చోట్ల ఫిల్టర్ మెంబ్రేన్ మార్చక, మరమ్మతులు చేయకుండా, విద్యుత్ సమస్యలు పరిష్కరించకపోవడంతో యంత్రాలు నిలిచిపోయాయి. ప్లాంట్లు పనిచేయకపోవడంతో విద్యార్థులు బావి నీరు, ట్యాంకర్ నీరు లేదా గ్రామంలోని బోరు నీరే తాగాల్సి వస్తోంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు మళ్లీ తలెత్తుతున్నాయి. కావున పిల్లలకు శుద్ధమైన తాగునీరు అందించడం ప్రభుత్వం తీసుకోవాల్సిన సాధారణ బాధ్యత. కానీ పాఠశాలల్లో పనిచేయని ఆర్వో యంత్రాలను మరమ్మతు చేయడానికి ఇప్పటివరకూ ఎటువంటి చర్యలు ప్రారంభించలేదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో నీటి నాణ్యత చాలా చోట్ల తక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యపరంగా విద్యార్థులు ప్రమాదానికి గురవుతారన్నది పెద్ద సమస్యగా మారింది.
1,16,788 మంది విద్యార్థుల ఆరోగ్యం ప్రమాదంలో..
జిల్లాలోని 32 మండలాల్లో మొత్తం 1,16,788 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. వీరిలో ఒక పెద్ద శాతం పేద కుటుంబాలకు చెందినవారు. ఇంట్లోను శుద్ధ నీరు లభించే పరిస్థితి లేక.. పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు లేక విద్యార్థుల ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడుతోంది. చిన్న పిల్లలకు నీటిలోని సహజమైన దుష్టకణాలు, బ్యాక్టీరియా, రసాయన మలినాలు త్వరగానే ప్రభావం చూపుతాయి. గతంలో ఆర్వో వల్ల ఇలాంటి సమస్యలు చాలా తగ్గుముఖం పట్టాయి. కానీ ప్రస్తుతం ప్లాంట్లు పనిచేయకపోవడంతో టైఫాయిడ్, కడుపు నొప్పులు, జీర్ణాశయ సంబంధిత ఇబ్బందులు పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

మేమేం చేయగలం?
పాఠశాలకు పంపిన ఆర్వో ప్లాంట్ల నిర్వహణ, మరమ్మతులు కమ్యూనిటీ, తల్లిదండ్రుల సంఘం లేదా పాఠశాలలే చూసుకోవాలని ప్రభుత్వం అప్పగించిందంటూ ఉపాధ్యాయులు చెబుతున్నారు. అయితే దీని కోసం బడ్జెట్ ఇవ్వకపోవడంతో, పాఠశాల పేరుతో విరాళాలు సేకరించడం కూడా సమస్యగా మారుతోంది. “పిల్లలకోసం చేయాలని అనిపించినా, యంత్రం మరమ్మతులకు కనీసం కొన్ని వేల రూపాయలు అవుతాయి. మా చేతుల్లో ఏమీ లేదు” అని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
పట్టింపు లేకపోవడమే అసలు సమస్య..
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు పలుమార్లు చెబుతున్నప్పటికీ, పాఠశాలల్లో ప్రాథమిక సదుపాయాల నిర్వహణలో పూర్తిస్థాయి వైఫల్యం కనిపిస్తోంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, పాఠశాల భవనాల సమస్యలు, ఉపాధ్యాయుల కొరతలతో పాటు ఈ ఆర్వో ప్లాంట్ల సమస్య కూడా పెద్ద భారమై పడింది. పిల్లల ఆరోగ్యం రాజకీయ కోణంలో చూడొద్దని తల్లిదండ్రులు స్పష్టంగా చెబుతున్నారు. పూర్వ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్లాంట్లని కొనసాగించడం పెద్ద పని కాదు.. పిల్లల ఆరోగ్యమే ముఖ్యముని తెలిపారు. రాజకీయాలు పక్కన పెట్టి కనీసం తాగునీరు అందించడంలో చిత్తశుద్ధి చూపి తక్షణ చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
