శివనామ స్మరణతో పులకించిన ఉమామహేశ్వర క్షేత్రం

శివనామ స్మరణతో పులకించిన ఉమామహేశ్వర క్షేత్రం

  • మహాశివరాత్రికి పోటెత్తిన భక్తులు
  • ప్రత్యేక ఏర్పాట్లతో సజావుగా దర్శనాలు

అచ్చంపేట, ఆంధ్రప్రభ ; నాగర్‌కర్నూల్ జిల్లా రంగాపురం గ్రామంలో శ్రీశైలం ఉత్తర ద్వారంగా వెలసిన ప్రముఖ శైవ క్షేత్రం ఉమామహేశ్వర ఆలయం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల శివనామ స్మరణతో పులకించిపోయింది. ప్రకృతి రమణీయత, ఆధ్యాత్మిక చింతనకు నిలయమైన ఈ క్షేత్రానికి తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని నేరుగా అభిషేకాలు నిర్వహిస్తూ భక్తి పరవశం చెందారు. ఆలయ చైర్మన్ బీరం మాధవరెడ్డి, ఈవో శ్రీనివాసరావు, అర్చకులు, పాలకమండలి సభ్యులు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక చర్యలు చేపట్టారు. దర్శనాలు ఎలాంటి అసౌకర్యం లేకుండా సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయడంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.

జిల్లా నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. కొండకింద చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి కొండపైకి వాహనాల రాకపోకలను నిషేధించారు. దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల ద్వారా భక్తులను కొండపైకి తరలించారు. మెట్ల మార్గం ద్వారా కూడా భక్తులు కొండపైకి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులను క్రమబద్ధీకరించి రక్షణ చర్యలు చేపట్టింది. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. మహాశివరాత్రి లింగోద్భవం సందర్భంగా సాయంత్రం నుంచి చైర్మన్ ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా, వాటిని డాక్టర్ వంశీకృష్ణ ప్రారంభించారు.

Leave a Reply