శ్రీ జ్ఞాన సరస్వతి నిజరూప దర్శనం

బాసర, అక్టోబర్ 1 (ఆంధ్రప్రభ) : నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో బుధవారం తెల్లవారుజామున యాగ మండపంలో పండితుల వేదమంత్రోచ్ఛారణలతో పూర్ణాహుతితో శరన్నవరాత్రి ఉత్సవాలు సంపూర్ణమయ్యాయి. ఈ ఉత్సవాలలో భాగంగా పదవరోజు అమ్మవారు నిజరూప శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువ జామున శ్రీ జ్ఞాన సరస్వతి, శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, అమ్మవార్లకు మహా అభిషేకం చేసి విఘ్నేశ్వర పూజ, క్షేత్ర పూజ నిర్వహించి మహా హారతి నిర్వహించారు.

వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఆలయంలోని అమ్మవాళ్లను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ముఖానికి అలంకరించిన బండారి (పసుపు), మహంకాళి అమ్మవారి మెడలో వేసిన నిమ్మకాయల కొరకు భక్తులు బారులు తీరారు. ఈ నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు అమ్మవార్లకు అభిషేకం చేసిన తర్వాత, ఉత్సవాలలో చివరి రోజు ఈరోజు ముగ్గురి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ.

Leave a Reply