న్యూ ఢిల్లీ : మహాకుంభమేళా విజయం అందరూ కలసికట్టుగా చేసిన కృషికి నిదర్శనమని ప్రధాని మోడీ అన్నారు. ఈ సందర్భంగా భారత్ గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం చూసిందన్నారు ఈ విజయంపై దేశ ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం లోక్‌సభలో ప్రధాని ప్రసంగిస్తూ… లోక్‌సభలో కుంభమేళా గురించి ప్రస్తావించారు. కుంభమేళా ద్వారా భారత వైభవాన్ని యావత్ ప్రపంచం వీక్షించిందన్నారు.
“ఎర్రకోట నుండి సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్ ప్రాముఖ్యతను నేను ప్రధానంగా ప్రస్తావించాను. గతేడాది శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశం మొత్తం ఎలా పులకించిపోయిందో చూశాం. కుంభమేళాలోనూ అలాంటి ఐక్యతే కనిపించింది. ప్రపంచం మొత్తం భారతదేశ శక్తిసామర్థ్యాలను ఈ రూపంలో చూసింది. మన బలాన్ని అవమానించే వారికి ఈ కార్యక్రమం తగిన సమాధానం ఇచ్చింది. ఇక భారత సంప్రదాయాలను కొత్తతరం గౌరవంతో స్వీకరిస్తోంది” అని మాట్లాడారు. ప్రయాగరాజ్‌లో కుంభమేళా విజయవంతంగా నిర్వహించడం సమిష్టి కృషికి అసలైన ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. ‘‘కుంభమేళా విజయవంతం చేసేందుకు ఎందరో తమ వంతు పాత్ర పోషించారు. ఆ కర్మ యోగులందరికీ నా ధన్యవాదాలు’’ అని అన్నారు.
భిన్నత్వంలో ఏకత్వానికి ఆలవాలమైన భారత సంస్కృతి కుంభమేళాలో ఆవిష్కృతమైందని ప్రధాని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా చెలరేగుతున్న యుద్ధాల కారణంగా దేశాల మధ్య ఎడం పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశం.. భిన్నత్వంలో ఏకత్వమే తన ప్రత్యేకత అని కుంభమేళాతో గొప్పగా చాటుకుందని పేర్కొన్నారు. మహా కుంభమేళాలో యువతరం పెద్ద ఎత్తున పాల్గొనడంపై కూడా ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. సంప్రదాయాలను ఆధ్యాత్మికతను యువత సగర్వంగా అందిపుచ్చుకున్నదని వ్యాఖ్యానించారు.
పుణ్య స్నానాలు ఆచరించిన 66 కోట్ల మంది….
ప్రతీ 12ఏళ్లకు ఓసారి నిర్వహించే ఈ మహా కుంభమేళా జనవరి 13న మొదలు కాగా, ఫిబ్రవరి 26 వరకు కొనసాగింది. కోట్లాది మంది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. కుంభమేళా ముగిసిన తర్వాత మోడీ ఓ పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. దేశంలో సరికొత్త ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసిందని, ఇదే స్ఫూర్తితో, ఇదే ఆత్మవిశ్వాసంతో వికసిత భారత్ దిశగా అడుగులు వేయడానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
ఆధ్యాత్మిక వేడుకలో ఏమైనా పొరపాట్లు జరిగితే క్షమించాలని గంగ, యమున, సరస్వతి నదీమ తల్లులతో పాటు ప్రజల్ని కోరారు. తన దృష్టిలో ప్రజలూ దేవుడి ప్రతిరూపాలేనని పేర్కొన్నారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అంత సులువు కాదు.. అమెరికా జనాభా కంటే రెండింతల మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు. అంచనాలను మించి ప్రజలు తరలివచ్చారు. ఐక్యతతో ఈ మహాయజ్ఞం దిగ్విజయంగా ముగిసిందని అప్పుడు తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. నదిలో స్నానమాచరించిన తర్వాత వారి ముఖాల్లో కనిపించిన సంతోషం, సంతృప్తి నేనెప్పటికీ మర్చిపోలేనన్నారు.