రంగస్థలం.. సర్వం సిద్ధం..

రంగస్థలం.. సర్వం సిద్ధం..

యడ్లపాడు, ఆంధ్రప్రభ : యడ్లపాడు గ్రామస్తులతో కలిసి కళామతల్లికి రెండు దశాబ్దాలకు పైగా సేవలు చేస్తున్నారు. యడ్లపాడు పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం కార్యవర్గ కమిటీ వేదిక అధ్యక్షులు ముత్తవరపు సురేష్‌ బాబు ఆధ్వర్యంలో ఏటికేడు పోటీల నిర్వహణలో సరికొత్త ధోరణి అవలంభించడం విశేషం. కళానిలయంలో ఈ ఏడాది 23వ జాతీయ స్థాయి నాటికల పోటీల నిర్వహణకు రంగం రంగస్థలం.. సర్వం సిద్ధం ఈ నెల 3,4,5, తేదీల్లో నాటిక పోటీలు జరగనున్నాయి. రంగస్థల, సినీ రంగ ప్రముఖులకు ఘన సత్కారాలు చేయనున్నారు. సుప్రసిద్ధ నటులు, దర్శకులు ఉప్పులూరి సుబ్బరాయశర్మకు ప్రతిష్టాత్మక ‘పుచ్చలపల్లి పురస్కారం’, తెలుగు అకాడమీ చైర్మన్, పౌరాణిక నాటక రంగంలో విశేష గుర్తింపు పొందిన కళారత్న గుమ్మడి గోపాలకృష్ణను పుచ్చలపల్లి సుందరయ్య ‘వేదిక’ సంస్థల ఆధ్వర్యంలో సన్మానించనున్నారు.

రంగస్థల మార్తాండుడు ‘ఉప్పులూరి’కి పుచ్చలపల్లి సుందరయ్య పురస్కారం
నటనకు భాష్యం..అక్షరానికి ప్రాణం ఉప్పులూరి సుబ్బరాయశర్మ. ఆరు దశాబ్దాలకు పైగా కళామతల్లి సేవలో తరిస్తూ, అభినయమే శ్వాసగా బతుకుతున్న బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ నటులు ఉప్పులూరి సుబ్బరాయ శర్మ ఈ ఏడాది ప్రతిష్టాత్మక ‘పుచ్చలపల్లి సుందరయ్య–2026’ కళా పురస్కారానికి ఎంపికయ్యారు. శుక్రవారం రాత్రి యడ్లపాడులో జరుగుతున్న 23వ జాతీయ స్థాయి నాటిక పోటీల వేదికపై ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి
1947లో విజయవాడలో జన్మించిన సుబ్బరాయ శర్మ, 13వ ఏటనే (1966) రంగస్థల ప్రవేశం చేశారు. రేడియో, స్టేజీ, టీవీ, వెండితెర.. ఇలా ఏ మాధ్యమమైనా తనదైన ముద్ర వేశారు. కేవలం నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన సేవలు అనితరసాధ్యం.

అరుదైన ప్రయోగాలు.. అద్భుత నటన
30 ఏళ్ల ప్రాయంలోనే ‘ఆర్తి’ నాటకంలో 80 ఏళ్ల వద్ధుడి పాత్రలో జీవించి, అంతర్జాతీయ దర్శకుడు మణాల్‌సేన్‌ ప్రశంసలు పొందడం ఆయన నటనా పటిమకు నిదర్శనం. దేశోరాజు హనుమంతరావు దర్శకత్వంలో 45 నిమిషాల పాటు ఒంటరి నటనతో సాగించిన ప్రయోగం నాటక చరిత్రలో ఒక మైలురాయి. దూరదర్శన్‌ తొలి రోజుల్లోనే కోట శ్రీనివాసరావుతో కలిసి నటించిన ఆయన ‘శివలీలలు’, ‘శ్రీ భాగవతం’ వంటి సీరియళ్లలో కీలక పాత్రలు పోషించారు. దర్శక నిర్మాతగా ‘నూరేళ్ల పంట’, ‘భక్త విజయం’ వంటి సందేశాత్మక చిత్రాలను అందించారు.

వెండితెర పై చెరగని ముద్ర
1982లో సినిమాల్లోకి ప్రవేశించిన సుబ్బరాయ శర్మ.. మాతదేవోభవ, యమలీల, మాయలోడు వంటి చిత్రాల నుంచి బాహుబలి, మగధీర వంటి భారీ చిత్రాల వరకు వందలాది సినిమాల్లో నటించారు. ఎన్ని విజయాలు సాధించినా తన జన్మస్థానమైన రంగస్థలాన్ని మర్చిపోకుండా, అనేక నాటక పరిషత్తులకు ఊపిరి పోస్తూ వస్తున్నారు. కళాకారుడిగా ఆయన ప్రస్థానం రేపటి తరానికి స్ఫూర్తిదాయకం.అటువంటి మహనీయుడిని పుచ్చలపల్లి సుందరయ్య పేరుతో సత్కరించుకోవడం తెలుగు నాటకరంగానికి దక్కిన గౌరవం.

తెలుగు పద్య నాటక ధ్రువతార ‘కళారత్న’ గుమ్మడి గోపాలకృష్ణకు ఘన సత్కారం
తెలుగు రంగస్థల వైభవాన్ని దశదిశలా చాటి, పద్య నాటకానికి పూర్వ వైభవం తీసుకువచ్చిన మహానటుడు, ‘కళారత్న’ గుమ్మడి గోపాలకృష్ణను పుచ్చలపల్లి సుందరయ్య నాటకోత్సవాల సందర్భంగా ఘనంగా సత్కరించనున్నారు. శుక్రవారం రాత్రి జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ గౌరవాన్ని అందుకోనున్నారు.

నేపథ్యం మరియు ప్రస్థానం..
కృష్ణా జిల్లా మేడూరు గ్రామంలో గుమ్మడి నాంచారయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించిన గోపాలకృష్ణ, తెలుగు సంస్కృతి సంప్రదాయాలను తన నటన ద్వారా భావి తరాలకు అందించారు. పౌరాణిక, చారిత్రక, సామాజిక నాటకాలలో ఆయన పోషించిన వైవిధ్యభరితమైన పాత్రలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి.

అభినయ వైదుష్యం – పద్య పఠన శైలి
గోపాలకృష్ణ అభినయం సహజత్వానికి చిరునామాగా ఉంటుంది. ముఖ్యంగా పద్య నాటకాలలో ఛందస్సు తప్పకుండా, స్పష్టమైన ఉచ్చరణతో పద్యాన్ని గానం చేయడంలో ఆయన సిద్ధహస్తులు. గంభీరమైన కంఠస్వరంతో, పాత్రలోని అంతర్లీన భావాలను సామాన్య ప్రేక్షకుడికి సైతం అర్థమయ్యేలా పలికించడం ఆయన ప్రత్యేకత. తన నటనలో యక్షగానం, భాగవతం వంటి సాంప్రదాయ శైలులను అద్భుతంగా సమన్వయం చేసి, తెలుగు నాటకానికి ఒక కొత్త ఒరవడిని సృష్టించారు.

సాంస్కృతిక వారసత్వం
తెలుగు పద్య నాటకం అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అది మన జాతి సంస్కృతికి ప్రతిబింబమని నమ్మిన ఆయన, విదేశాల్లోని ప్రవాస భారతీయుల మధ్య సైతం పద్య నాటక ప్రదర్శనలు ఇచ్చి తెలుగు భాషా మాధుర్యాన్ని చాటిచెప్పారు. కేవలం నటుడిగానే కాకుండా, ఒక ఉత్తమ గురువుగా ఆయన అనేక మంది శిష్యులను తీర్చిదిద్దారు. గ్రామీణ స్థాయి నుండి అంతర్జాతీయస్థాయి వరకు తెలుగు నాటక కీర్తిని విస్తరింపజేశారు.

పదవులు – పురస్కారాలు
ఆయన ప్రతిభను గుర్తించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, నాటక అకాడమీ చైర్మన్‌గా రెండు పర్యాయాలు నియమించింది. ‘కళారత్న’ బిరుదు మరెన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న ఆయన, నేటి తరానికి నాటక రంగ వారసులను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మహోన్నత కళాకారుడికి యడ్లపాడు పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం నాటకోత్సవ వేదికపై జరగనున్న ఘనంగా సత్కరించనుంది.

ప్రదర్శనలు:.. తొలిరోజైన ఏప్రిల్ 3న వీరన్నపాలెం వారి ‘దీపం కింద చీకటి’,విశాఖ వారి ‘(అ)సత్యం’, కాకినాడ బివికె క్రియేషన్స్ వారి ‘కన్నీటికి విలువెంత’నాటికలు ప్రదర్శితమవుతాయి.రెండో రోజైన ఏప్రిల్ 4న హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వారి ‘అమ్మ చెక్కిన బొమ్మ’, ‘స్త్రీ మాత్రే నమ:, గుంటూరు శ్రీరమణ కళానిలయం వారి ‘మాతృత్వం’ నాటికలతో పాటు యడ్లపాడు మానవతా సాగరి బృందం ‘మంచివారే.. కానీ’ అనే ప్రత్యేక హాస్య నాటికను ప్రదర్శిస్తారు. ముగింపు రోజైన ఏప్రిల్ 5న విజయవాడ సాంస్కృతిక సమితి వారి ‘మమ్మల్ని బతకనివ్వండి’,కట్రపాడు ఉషోదయ కళానికేతన్ వారి ‘మంచి మనసులు’,విశాఖ తెలుగు కళాసమితి వారి ‘చిటికెన వేలు’ నాటికలతో ఈ కళా ప్రదర్శనలు ముగియనున్నాయి. ప్రదర్శన ముగింపు అనంతరం బహుమతి ప్రదానం ఉంటుంది. పుచ్చలపల్లి సుందరయ్య కళ నిలయం కార్యవర్గ కమిటీ,వేదిక అధ్యక్షులు ముత్తవరపు సురేష్ బాబు తెలియజేశారు.

మెప్పు కాదు…మార్పు కావాలి! రేపటి కోసం
“కళ కళ కోసం కాదు, ప్రగతి కోసం” అని చాటిచెప్పిన మహనీయులకు మా నీరాజనం…

Leave a Reply