గాజులదిన్నె నిర్వాసితులు గగ్గోలు
గోనెగండ్ల, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని సంజీవయ్య సాగర్ (గాజులదిన్నె) ప్రాజెక్ట్ నీటిలో ముంపునకు గురైన పట్టా భూముల రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలని ఐరన్ బండ, ఎన్నె కండ్ల గ్రామాల రైతులు ఈ రోజు మండల తహసిల్దార్ రాజేశ్వరికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు ఈశ్వర్ రెడ్డి, పాండులు మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా గాజులదిన్నె ప్రాజెక్ట్ వల్ల ముంపునకు గురైన పట్టా భూముల రైతులకు నష్టపరిహారం అందించలేదన్నారు.
అలాగేప్రాజెక్టు నీటిమట్టం పెంపు ద్వారా ఎనకండ్ల, ఐరన్ బండ, గంజహళ్లి గ్రామాలకు చెందిన సుమారు 150 ఎకరాలు ముప్పునకు గురవుతున్నాయన్నారు. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. అంతేకాక 60 కోట్ల నిధులతో గాజుల ప్రాజెక్టు ఒక టీఎంసీ ఎత్తు పెంపు వల్ల బి ఐరన్ బండ, ఎన్నికండ్ల,గంజహళ్లి, గోనెగండ్ల గ్రామాలకు చెందిన 300 ఎకరాలు భూములు ముంపునకు గురవుతున్నాయన్నారు.
ఎత్తు పెంపు వల్ల పట్టా భూములు ముంపునకు గురవుతున్న రైతులకు ఎకరాకు 40 లక్షల రూపాయలు, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజు, శివ, రామానాయుడు, రామలక్ష్మి పాల్గొన్నారు.