రంగారెడ్డి జిల్లాలో భూచోరుల రియల్ కథ
ఫేక్ పత్రాలతో రూ.10 కోట్ల సర్కారు భూమికి ఎసరు
(కె. ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి మెదక్ బ్యూరో) : అక్కడ లేదు. ఇక్కడ లేదు. ఊరు లేదు. వాడ లేదు. జిల్లా ఊసే అక్కర్లేదు. సరిహద్దే లేదు. జాగా జాగానే. వేసేయ్ పాగా. సర్కారుదైతే.. అసలు తగ్గేదే లేదు. పైసలుంటే రిజిస్ట్రేషన్ ఆగదు. సబ్ రిజిష్ట్రార్లు (Sub-Registrars) మనోళ్లే. ఫేక్ ఎల్ ఆర్ ఎస్ తో ఆఫీసర్లను బోల్తా కొట్టించు. మందిని దించు.. దర్జాగా కబ్జా చేసేయ్.. కోట్లకు కోట్లు కొల్లగొట్టు.. ఇదీ.. విశ్వనగరిలో రంగారెడ్డి జిల్లాలో భూచోరుల రియల్ కథ.
ఔను ప్రభుత్వ భూములపై కన్నేస్తున్న కేటుగాళ్ళు ఎంతటి బరితెగింపుకైనా వెనకాడటం లేదు. ప్రభుత్వ భూముల కబ్జాకు అడ్డదారులు తొక్కేస్తున్నారు. ఒక జిల్లాలోని భూమి సర్వే నెంబర్లతో.. మరో జిల్లాలో రిజిస్ర్టేషన్ పత్రాలు సృష్టించి కోట్ల విలువ చేసే భూమిని హస్తగతం చేసుకొంటున్నారు. రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) పరిధిలోని మియాపూర్ సర్వే నెంబర్ 100,101 లోని ప్రభుత్వ భూమిపై కన్నేసి పక్కనే అమీన్ పూర్ ప్రాంతం నెంబర్లతో డాక్యుమెంట్లు సృష్టించారు. ఇంకో అడుగు ముందుకేసి ఎల్ ఆర్ ఎస్ ఫేక్ డాక్యుమెంటు సృష్టించి నిర్మాణ అనుమతి పొందారు. ఇంకేముంది గత కొన్నాళ్లుగా చక చక నిర్మాణాలు సాగుతున్నాయి. కబ్జా కోరులు మింగేసిన హెచ్ ఎం డి ఏ స్థలం విలువ 10 కోట్ల పైమాటే.. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ అధికారులు మాత్రం సర్వేలు, కేసులు, విచారణలు అంటూ కాలయాపన చేస్తున్నారు. హైడ్రా స్పందిస్తే తప్ప ప్రభుత్వ భూములకు రక్షణ లేదని సర్వత్రా అభిప్రాయం వెల్లడిస్తున్నారు..
అది సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా సరిహద్దు ప్రాంత భూమి..పక్కాగా ఆది హెచ్ఎం డీఏ స్థలమే.. మియాపూర్ (Miyapur) సర్వే నెంబర్ 100, 101 లో 500 ఎకరాల స్థలమే.. హెచ్ఎండీఏ గతంలోనే సరిహద్దు రాళ్ళు ఏర్పాటు చేసి కంచెను వేసింది. రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతం కావడంతో అక్రమార్కుల కన్ను పడింది. ఇంకేముంది నకిలీ డాక్యుమెంట్లు పుట్టుకొచ్చాయి. లే అవుట్లలో లో లేని ప్లాట్లను ఉన్నట్లు చూపించి ప్రభుత్వ స్థలాలను కొల్లగొట్టేందుకు ప్రణాళికలు రచించారు. ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టీ నిర్మాణ అనుమతులు సైతం పొందారు. అనుమతులు రాగానే చకచక నిర్మాణాలు చేస్తున్నారు. ఇప్పటికే సదరు నిర్మాణాలపై పిర్యాదుల వెల్లువెత్తగా విచారణ చేసిన అధికారులు ఫేక్ ఎల్ ఆర్ ఎస్ అని తెలిసి నిర్మాణ అనుమతులు రద్దు చేశారు.

రూ.10 కోట్ల స్థలం పై అక్రమార్కుల కన్ను
సంగారెడ్డి జిల్లా (Sangareddy District) అమీన్పూర్ లో మాధవపురి టౌన్ షిప్ సౌత్ ఎవెన్యూ పేరిట సర్వే నెంబర్ 338,339 లో ఏర్పాటు చేశారు. దీనిని అనుకుని దీప్తి శ్రీనగర్ హుడా కాలనీ ఉంది.. దీప్తి శ్రీ నగర్ హుడా కాలనీ లే ఔట్ లో బజాప్తా ఓపెన్ స్థలం ఉంది.. ప్రస్తుతం కబ్జా చేసి నిర్మిస్తున్న స్థలం మాధవపురి టౌన్ షిప్ సౌత్ ఎవెన్యూ లే మాత్రం విలేజ్ బ్రదర్ అవతల చూపిస్తుండగా కబ్జా దారులు మాధవపురి టౌన్ షిప్ లోక్ వస్తుందని ఫేక్ లే ఔట్, ఫేక్ ఎల్ ఆర్ ఎస్ సృష్టించి ప్లాట్ నెంబర్ 126 పార్ట్, 126/సీ, 126/డీ అంటూ డాక్యుమెంట్లు సైతం సృష్టించారు. ఇక అనుకున్న రీతిలో డాక్యుమెంటు సృష్టించి ఫేక్ ఎల్ ఆర్ ఎస్ తో అమీన్ పూర్ మున్సిపాలిటీ నుండి 831.07 స్క్వేర్ మీటర్లకు గాను నిర్మాణ అనుమతులు పొందారు..నిర్మాణ అనుమతుల సందర్భంగా పొందుపర్చిన డాక్యుమెంట్స్ మొత్తం ఫేక్ అనే చెప్పాలి.. ఇదిలా ఉండగా ఫిర్యాదుల మీద ఫిర్యాదులు రావడంతో హెచ్ ఎం డి ఏ ఎల్ ఆర్ ఎస్ పై విచారణ చేసి ప్లాట్ నెంబర్ 126 పార్ట్, 126/సీ, 126/డీ నిర్మాణ అనుమతులకు ఫేక్ ఎల్ ఆర్ ఎస్ పొందుపర్చారని వెంటనే నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని అమీన్పూర్ కమిషనర్కు సూచించింది. హెచ్ ఎం డీ ఏ లేఖతో అప్రమత్తమైన అమీన్పూర్ కమిషనర్ జ్యోతి రెడ్డి ప్లాట్ నెంబర్ 126 పార్ట్, 126/సీ, 126/డీ లకు జారీ చేసిన నిర్మాణ అనుమతులను రద్దు చేసింది. అంతేకాకుండా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో నిర్మాణ దారులపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో ఎల్లారెడ్డి అండ్ అదర్స్ పై ఫోర్జరీ, చీటింగ్ పై కేసు నమోదు కాగా విచారణ జరుగుతోంది.

కేసు నమోదు చేశాం..
చర్యలు తీసుకుంటాం : నరేష్, సీఐ, అమీన్పూర్
అమీన్పూర్ మున్సిపాలిటీ కమిషనర్ జ్యోతి రెడ్డి ఎల్లారెడ్డి అండ్ అదర్స్ పై ఫిర్యాదు చేశారు. అమీన్పూర్ సర్వే నెంబర్ 338 లోని ప్లాట్ నెంబర్ 126 పార్ట్, 126/సీ, 126/డీ పేరిట నిర్మాణ అనుమతి పొంది హెచ్ఎండిఏ భూమిలో నిర్మాణాలు చేస్తున్నారని,వి అంతేకాకుండా ఫేక్ ఎల్ఆర్ఎస్ ధృవీకరణ పత్రం నిర్మాణ అనుమతుల కోసం పెట్టారని విచారణలో సంతకాలు ఫోర్జరీ చేసినట్లు
, ఫేక్ ఎల్ఆర్ఎస్ తేలిందని ఈ మేరకు ఎల్లారెడ్డి అండ్ అదర్స్ పై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ జ్యోతి రెడ్డి ఫిర్యాదు చేశారు. కమిషనర్ జ్యోతి రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నారు. విచారణ పూర్తయిన అనంతరం చర్యలు తీసుకుంటాం.

అనుమతులు రద్దు చేశాం..
జ్యోతి రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్
ఎల్లారెడ్డి అండ్ అదర్స్ ప్లాట్ నెంబర్ 126 పార్ట్, 126/సీ, 126/డీ నెంబర్లతో సర్వే నెంబర్ 338 పేర్కొంటూ అమీన్పూర్ నుండి గ్రౌండ్ ప్లస్ ఐదు అంతస్తుల నిర్మాణ అనుమతులకు నిర్మాణ అనుమతులు పొందారు. వాస్తవంగా తీసుకున్న నిర్మాణ అనుమతులు అమీన్పూర్ వి అయితే వారు నిర్మించేది మియాపూర్ పరిధిలో.. ఇప్పటికే దీనిపై చాలా ఫిర్యాదులు అందాయి. హెచ్ఎండిఏ కూడా విచారణ చేసి నిర్మాణ అనుమతుల కోసం పొందుపర్చిన ఎల్ ఆర్ ఎస్ ఫేక్ డాక్యుమెంట్ అని తేల్చింది. నిర్మాణ అనుమతులు రద్దు చేశాం. ఫేక్ ఎల్ఆర్ ఎస్ పెట్టీ నిర్మాణ అనుమతులు పొందిన వారిపై పీఎస్ లో పిర్యాదు చేయాలని హెచ్ఎండిఏ సూచించింది. ఈ మేరకు అమీన్పూర్ పీ ఎస్ లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాం.
అది ముమ్మాటికి హెచ్ ఎం డి ఏ స్థలమే..: దివ్యారెడ్డి, తహసిల్దార్, హెచ్ఎండిఏ
అమీన్ పూర్ సర్వే నెంబర్ 337, 338 అని చెబుతూ మియాపూర్ సర్వే నెంబర్ 101లోని భూమిని ఆక్రమించి నిర్మాణాలు సాగిస్తున్నారు. కానీ అది ముమ్మాటికీ సర్వే నెంబర్ 101లోనిది హెచ్ ఎం డి ఏ స్థలమే.. గతంలో అక్కడ మేము హద్దురాళ్ళు ఏర్పాటు చేసి కంచెను వేశాం.. ప్రస్తుతం నిర్మాణ దారులు కంచె ను తొలగించి హెచ్ఎండిఏ స్థలంలో నిర్మాణాలు చేస్తున్నారు. రెండు జిల్లాల మధ్య ఉన్న ప్రభుత్వ స్థలం ఉండటంతో సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల ఏడీల సర్వేకు నివేదించాం.. సర్వే నివేదిక రాగానే మా తదుపరి చర్యలు ఉంటాయి.

హైడ్రా స్పందించాలి : శోభన్, సీపీఐ ఇంచార్జి, శేరిలింగంపల్లి
హెచ్ఎండిఏ, రెవెన్యూ మున్సిపల్ శాఖలనే కాకుండా కోర్టులను కూడా తప్పుదోవ పట్టించి ప్రభుత్వ భూమిని కబ్జా చేసి బిల్డర్లు అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. ప్రభుత్వ భూమి అని తెలిసినా కూడా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఈ భవనం ప్రారంభ దశ నుండి ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం. అన్ని విభాగాల అధికారులకు ఫిర్యాదు చేశాం .నోటీసులు ఇస్తున్నారు ,సర్వేలు చేస్తున్నారు, కాలయాపన చేస్తున్నారు తప్ప చర్యలు తీసుకోవట్లేదు. పేద ప్రజలు తెలిసో తెలియకో ఓ 100 గజాలు గుడిసే వేసుకుంటే జేసీబీలతో రంగ ప్రవేశం చేసి కూల్చే అధికారులు సర్వే నెంబర్ 100,101 విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ విషయంలో హైడ్రా చొరవ తీసుకుంటే తప్ప అక్రమార్కుల ఆటలకు చెక్ పడేలా లేదు.

