రైల్లో ప్రయాణించే వారందరికీ లగేజీ పరిమితిపై ఇప్పటికే కొన్ని నియమాలు అమల్లో ఉన్నప్పటికీ, అవి ఇప్పటివరకు పెద్దగా అమలు కాలేదు. రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాల కొరత కారణంగా ఈ నియమాలు కేవలం పేపర్ మీదే ఉండిపోయాయి. ఇప్పుడు రైల్వే శాఖ ఈ లగేజీ నియమాలను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.
ఇకపై ఎయిర్‌పోర్ట్‌ల తరహాలోనే రైల్వే స్టేషన్లలోనూ లగేజీ తనిఖీలు జరగనున్నాయి. ప్రారంభ దశలో కొన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ కఠిన నియమాలను అమలు చేయాలని నిర్ణయించినట్టు రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రయాణికులు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలపై (ఇ-స్కేలు) తమ బ్యాగులను ఉంచి బరువును నిర్ధారించుకోవాలి.
లగేజీ పరిమితి ఇలా…
ఫస్ట్ క్లాస్ ఏసీ : గరిష్ఠంగా 70 కిలోలు
ఏసీ 2-టైర్: 50 కిలోలు
ఏసీ 3-టైర్ & స్లీపర్ క్లాస్ : 40 కిలోలు
సెకండ్ క్లాస్: 35 కిలోలు
నిర్దిష్ట పరిమితికి మించి లగేజీ ఉంటే, అదనపు రుసుము లేదా పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ సామాను తీసుకెళ్లాల్సిన వారు రైలు బయలుదేరే ముందు కనీసం అరగంట ముందే లగేజీ కౌంటర్‌ను సంప్రదించడం మంచిది. ఈ కఠినమైన చర్యల ముఖ్య ఉద్దేశ్యం ప్రయాణీకుల భద్రతతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం అని రైల్వేలు తెలిపాయి.