దేశ బహిష్కరణే శిక్ష!
- మెడికల్ వీసాతో వచ్చి..
- 9 ఏళ్లుగా అక్రమంగా…
హైదరాబాద్, ఆంధ్రప్రభ : మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న నైజీరియన్ వ్యక్తిని నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ అధికారులు దేశ బహిష్కరణ శిక్ష విధించారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW) ఈ రోజు మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొన్న 46 ఏళ్ల నైజీరియన్ జాతీయుడిని బహిష్కరించింది.
ఒనూరా సోలోమన్ చిబుయెజ్ అనే నైజీరియన్ దేశస్థుడు ఆగస్టు 14, 2014 నాడు వైద్య వీసాతో భారతదేశంలోని న్యూ ఢిల్లీకి వచ్చాడు. అతడి వీసా కేవలం సెప్టెంబర్ 23, 2014 వరకు మాత్రమే చెల్లుబాటు అయ్యింది. అయినప్పటికీ భారత్ లో అక్రమంగా జీవనం కొనసాగిస్తూ అక్రమాలకు పాల్పడ్డాడు.
సెప్టెంబర్ 2014 లో హైదరాబాద్‌కి వచ్చి, అత్తాపూర్‌లో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, డ్రగ్ పేడ్లింగ్ కార్యకలాపాలను ప్రారంభించాడు. ఈ క్రమంలో, అతడు పుణె, ముంబై వంటి ప్రాంతాల నుండి గంజాయిని తెప్పించి, హైదరాబాద్‌లో అధిక ధరలకు విక్రయిస్తూ వచ్చాడు.
చివరికి, టోలిచౌకీ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారణ జరిపారు. ఈ విచారణలో చిబుయెజ్ పాస్‌పోర్ట్, వీసా గడువు తీరిపోయినట్లుగా వెల్లడైంది. చట్టపరమైన ప్రక్రియల్లో భాగంగా, హెచ్-న్యూ అధికారులు న్యూ ఢిల్లీలోని నైజీరియా హైకమిషన్ నుండి అతడి కోసం ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్‌ను సాధించి.. అన్ని చట్టపరమైన పత్రాలను, ప్రక్రియలను పూర్తి చేసిన తరువాత, ఒనూరా సోలోమన్ చిబుయెజ్‌ను అధికారికంగా నైజీరియాకు పంపించి భారత దేశంలో అడుగుపెట్టకుండా శిక్ష విధించారు.