అఖండ-2’కు లైన్ క్లియర్..

- టికెట్ ధరల పెంపునకు సర్కార్ ఓకే
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి కాంబినేషన్లో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘అఖండ-2’ విడుదలకు మార్గం సుగమమైంది. 14 రీల్స్ ప్లస్, ఈరోస్ (Eros) సంస్థల మధ్య నెలకొన్న ఆర్థిక వివాదాలు మంగళవారం రాత్రి పరిష్కారమవడంతో, సినిమాను షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
దీనికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను కూడా సోషల్ మీడియాలో విడుదల చేసింది. అసలు ఈ నెల 5నే విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం, చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే.
విడుదలకు ముందే చిత్ర యూనిట్‌కు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. డిసెంబర్ 12 నుంచి 14 వరకు మూడు రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతినిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
దీని ప్రకారం, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి టికెట్‌పై రూ. 50, మల్టీప్లెక్స్‌లలో జీఎస్టీతో కలిపి టికెట్‌పై రూ. 100 అదనంగా వసూలు చేసుకోవచ్చు.
అంతేకాక, డిసెంబర్ 11న రాత్రి 9 గంటలకు ప్రదర్శించే ప్రీమియర్ షో టికెట్ ధరను రూ. 600గా నిర్ణయించారు.
ఈ విజయవంతమైన ‘అఖండ’ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కిన ఈ చిత్రంలో సంయుక్తా మేనన్ కథానాయికగా నటించగా, ఆది పినిశెట్టి విలన్ పాత్రను పోషించారు. రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు.
