భక్తుల విశ్వాసానికి ప్రతీక కోడె మొక్కు

కోడెల‌ను వ్యవసాయానికి మాత్రమే ఉపయోగించాలి
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, ఆంధ్రప్రభ : రాజన్న భక్తుల విశ్వాసానికి ప్రతీక కోడె మొక్కు అని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్‌లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలలో రైతులకు ఉచిత కోడెల పంపిణీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోడెలను రైతులకు పంపిణీ చేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా స్వామివారికి కోడెను కట్టే సంస్కృతి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉందన్నారు. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా కోడె మొక్కు చెల్లింపు నిలుస్తుందన్నారు.

తిప్పాపూర్ గోశాలలో రైతులకు ఉచితంగా స్వామివారి కోడెలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతులకు ఉచిత కోడెలను పంపిణీ చేస్తున్నామన్నారు. రైతులకు నేరుగా కోడెలను పంపిణీ చేయడం వలన వారికి వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారన్నారు. రైతులు కోడెలను చక్కగా చూసుకుంటూ సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు. రైతులకు పంపిణీ చేసిన కోడెలను అప్పుడప్పుడు పరీక్షిస్తున్నామని, వాటిని ఇతర అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వేములవాడలో అధునాతన సౌకర్యాలతో 40 ఎకరాల్లో సువిశాల స్థలంలో గోశాల నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. 40 ఎకరాల విస్తీర్ణంలో అనువైన స్థలాన్ని ఎంపిక చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. రాజన్నకు కోడె మొక్కులు చెల్లించే వారు పాలు మరిచిన తర్వాత కోడెలను అందజే యాలన్నారు. ఈకార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply