HYD | రెండో రోజూ అదే దంచుడు.. మున‌క‌లో ప‌లు కాల‌నీలు !

  • పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్!

తెలంగాణలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైద‌రాబాద్ నగరంలో కూడా వరుసగా రెండో రోజు వరుణుడి ప్రభావం కొనసాగుతోంది. శుక్రవారం హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా… ప‌లు కాలనీలు నీట మునిగాయి. ఈ వర్షం కారణంగా రోడ్లు, ఫ్లైఓవర్లు జలమయం కావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.

ఇక‌ ఈరోజు (శనివారం) మధ్యాహ్నం నుంచి హైదరాబాద్‌లో వర్షం ప్రారంభమైంది. బోయిన్‌పల్లి, సికింద్రాబాద్, బేగంపేట, మారేడుపల్లి సహా నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ప‌లు జిల్లాలకు శనివారం కూడా వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని GHMC అధికారులు సూచించారు.

జిల్లాల వారీగా వర్ష హెచ్చరికలు

భారీ వర్ష సూచన నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది.

అదే సమయంలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన వర్షాలు, గంటకు 40 కి.మీ.ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలలో కూడా వర్షాలు పడవచ్చని తెలిపారు.

ఆదివారం వర్షాలు

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలలో ఆదివారం కూడా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

Leave a Reply