అక్షయపాత్రగా… వర్ధిల్లుతున్న శ్రీ విద్యాధరి క్షేత్రం

వర్గల్, ఆంధ్రప్రభ ; శ్రీ విద్యా సరస్వతి స్వరూపమైన శ్రీ అన్నపూర్ణాదేవి సంపూర్ణ ఆశీస్సులతో భక్తులకు నిరంతరం మహా ప్రసాదాన్ని అందజేస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక చైర్మన్, బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి పేర్కొన్నారు. వర్గల్ క్షేత్రానికి అనుబంధంగా నిర్మించిన శ్రీ విద్యా సరస్వతి అన్న ప్రసాద వితరణ (మహా భోజనశాల) కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీ విద్యా సరస్వతి అమ్మవారు భక్తుల పాలిట కొంగుబంగారంగా, కల్పతరువే కాకుండా ఆధ్యాత్మిక భావనలకు ఉద్దీపనగా విలసిల్లుతోందని స్పష్టం చేశారు. విశ్వంలోని జీవులందరికీ పోషణ బాధ్యతలు చూసే శ్రీ అన్నపూర్ణ దేవి కాగా, “అన్న” అంటే ఆహారం, “పూర్ణ” అంటే సంపూర్ణమని, ఆకలి తీర్చే శక్తికి ప్రతీక అని గుర్తు చేశారు. ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులు, దాతల సహకారంతో ఈ పుణ్యక్షేత్రం విలసిల్లుతుండగా, తెలంగాణ జిల్లాల్లోనే సుప్రసిద్ధ ఆలయంగా తీర్చిదిద్దాలన్నది తమ ముందున్న లక్ష్యమని ఆయన వివరించారు.
