( నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ ) : నంద్యాల (Nandyal) జిల్లాలో ఓ గర్భిణీ విచిత్ర పరిస్థితి ఎదుర్కొంది. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పొమ్మన్నారు. 108 వాహనం కాపాడింది. ఆంబులెన్సులో ఉన్న బంధువులే ఆమెకు కాన్పు చేశారు. నంద్యాల జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. డోన్ పట్టణానికి చెందిన సుజాతమ్మ (Sujatamma) పురిటి నొప్పులతో డోన్ ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. కనీసం అక్కడి వైద్యులు పరీక్షించలేదు. పైగా ఆమె విషమ పరిస్థితిలో ఉందని కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఆ మహిళ బంధువులు 108 అంబులెన్స్ లో కర్నూల్ (Kurnool) కి బయల్దేరారు. మార్గమధ్యంలో తాడు టోల్గేట్ దగ్గర ఆమెకు నొప్పులు వచ్చాయి. ఇక 108లోనే బంధువుల సాయంతో ఆ గర్భిణీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించాలని బాధితులు ఆరోపిస్తున్నారు. సరైన వైద్యం అందించక పరీక్షలు నిర్వహించలేదని, పైగా కర్నూలు ప్రభుత్వాసుపత్రి (Kurnool Government Hospital) కి రిఫర్ చేయడం ఎంతవరకు సబబని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా 108 అంబులెన్స్ వాహనంలో ఆధునిక సౌకర్యాలు ఉండటం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ 108 అంబులెన్స్ వాహనం ఉపయోగపడటం స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 108 వాహనంలో ఉన్న సిబ్బందికి బాధితులు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వాసుపత్రి లో కన్నా 108 వాహనంలోనే ఆధునిక సౌకర్యాలు ఉన్నాయని ఆ తల్లి ఆనందం వ్యక్తం చేసింది. డోన్ ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు, సిబ్బంది, మందుల కొరత తీవ్రంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. ఈఘటనలపై దృష్టి పెట్టి ప్రభుత్వ ఆసుపత్రిలోని వసతులు మెరుగుపర్చే విధంగా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.

