బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ తోనే సాధ్యం..

బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ తోనే సాధ్యం..

కేసీఆర్ పాలనలోనే సంక్షేమం – కాంగ్రెస్ వి అన్నీ అబద్ధపు వాగ్దానాలే
12 మంది బీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపు

  • మాజీ హోం మంత్రి మహమూద్ అలీ

భీమ్‌గల్, టౌన్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన మైనారిటీల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ హోం మంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆదివారం రాత్రి స్థానిక ఫంక్షన్ హాల్ లో మైనారిటీ లతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బాల్కొండ నియోజకవర్గంలో భీమ్‌గల్ ప్రాంతం అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరువయ్యాయని పేర్కొన్నారు. మాజీ మంత్రి, బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నాయకత్వం నియోజకవర్గానికి గర్వకారణమని అన్నారు.

స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అంకితభావాన్ని మహమూద్ అలీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. “ప్రశాంత్ రెడ్డి కేసీఆర్ అత్యంత ఆప్తుడు. అసెంబ్లీలో ఆయన పోషించిన పాత్ర నియోజకవర్గానికి గర్వకారణం. గంగా జమున తహజీబ్ (మత సామరస్యం) కి ఆయన నిదర్శనం. ప్రజల కష్టాలను తీర్చడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు” అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ వి అన్నీ అబద్ధపు హామీలే..
కాంగ్రెస్ పార్టీ గతంలో 42 ఏళ్ల పాటు పాలించినా మైనారిటీల సంక్షేమాన్ని విస్మరించిందని అలీ విమర్శించారు. కేవలం రెండు సంవత్సరాల్లోనే కేసీఆర్ 204 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి 1,40,000 మంది పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావడం లేదని, ప్రజలను మోసం చేయడమే ఆ పార్టీ నైజమని మండిపడ్డారు.

బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి..
భీమ్‌గల్ మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న 12 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. షాదీ ముబారక్, రైతు బంధు వంటి పథకాలు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయని, ఈ అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఒకప్పుడు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే.. తల్లిదండ్రులు అప్పుల పాలయ్యేవారని, కానీ కేసీఆర్ ‘కళ్యాణ లక్ష్మి’, ‘షాదీ ముబారక్’ పథకాల ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించి మేనమామలా అండగా నిలిచారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నల్గొండలో ఫ్లోరోసిస్ సమస్య, మహబూబ్‌నగర్‌లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండేదని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని స్పష్టం చేశారు. నీరు అందించకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని” అసెంబ్లీలో సవాల్ చేసి మరీ అమలు చేసిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.

గతంలో పవర్ హాలిడేలతో పరిశ్రమలు మూతపడేవని, కానీ ఇప్పుడు తెలంగాణ విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారిందని, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించడం మన విజయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు తులం బంగారం, రూ.4000 పెన్షన్ అంటూ అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. నేడు ఆ హామీలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు లోపాయికారీ ఒప్పందాలతో ప్రజలను వంచిస్తున్నాయని ఆరోపించారు. భీమ్‌గల్ మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న 12 మంది బీఆర్‌ఎస్ అభ్యర్థులను కారు గుర్తు పై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అభివృద్ధి ఆగకూడదంటే బీఆర్‌ఎస్ గెలవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధ్యక్షులు నవీద్ ఇక్బాల్, మొయిజ్ భాయ్, తాహెర్, అహ్మద్, బీఆర్ఎస్ అభ్యర్థులు, స్థానిక నాయకులు, మహిళలు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply