TEMPLE | పట్టు వదలని పేదవాని సంకల్పం

TEMPLE | పట్టు వదలని పేదవాని సంకల్పం
- వైభవంగా శ్రీకృష్ణ దేవాలయం నిర్మాణం
TEMPLE | లింగాల, ఆంధ్రప్రభ : ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడికి తన బాల్య స్నేహితుడు కుచేలుడు, అటుకులు ప్రేమ, భక్తితో ఇచ్చాడని పుస్తకాలల్లో చదివాము. ఈ నాడు ఈ కలియుగంలో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం రామట్లపల్లి గ్రామానికి చెందిన నిరుపేద రైతు మేకల రామమోహన్ అభినవ కుచేలుడుగా అభివర్ణించడంలో ఎలాంటి అతిశయోక్తిలేదనుటలో సందేహం వలదు. వివరాల్లోకి వెళ్లితే.. రామట్లపల్లి గ్రామా సమీపంలో నూతనంగా శ్రీకృష్ణ దేవాలయం రూ. కోటి యాభై లక్షలతో నిర్మాణం జరుగుతోంది.
పట్టువదలని పేదరైతు సంకల్పం..
రెక్కాడితే గాని డొక్కాడని ఈపేద రైతును, ఏ సమయంలో శ్రీకృష్ణుడు భగవానుడు ఆజ్ఞాపించాడో గాని ఈ అభినవ కుచేలుడు దేవాలయ నిర్మాణాన్ని 2018 నవంబర్ 18వ తేది మేకల రామ్మోహన్ ప్రారంబించాడు. నిద్రాహారాలు మాని చేతిలో చిల్లిగవ్వ లేకున్నా శ్రీకృష్ణుని మీద భారం వేసి ధృడ సంకల్పంతో అడుగు ముందుకు వేశాడు. ఆలయ నిర్మాణం పూర్తి అయ్యేవరకు, గడ్డం మీసం తీయని, దీక్షపూని భగవంతుని ఆశీస్సులతో, దాతల సహకారంతో ప్రస్తుతానికి ఆలయం 80శాతం పనులు, పూర్తి చేశాడు. ఇందులో పాడా (పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) నుంచి రూ. 55 లక్షల నిధులు మంజూరు చేయించి భక్తుల కోసం 4 వసతి రూములు నిర్మించారు. కాంక్రీటువాల్, మట్టి పూడిక పనులు చేశారు. అలాగే దేవాదయశాఖ వారు రూ. 21 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో దేవాలయం చుట్టూ, ప్రధాన ఆలయం, ఇటుకతో కాంపౌండ్ గోడ నిర్మించడం జరుగుతోంది.

మహాబలిపురం నుంచి శ్రీకృష్ణ మూల విరాట్ విగ్రహం..
తమిళనాడులోని మహాబలిపురం నుంచి మూలవిరాట్ శ్రీకృష్ణుని గ్రహాన్ని రూ. లక్షా 30 వేలతో తయారు చేయించి తీసుకువచ్చారు. ఆలయంలో లోపలి కప్పు పైభాగంలో రాశి ఫలాల బొమ్మలు, ఆలయ ప్రాంగణంలోనే శ్రీ మహా గణపతి ఆలయం కూడా నిర్మించారు. ఆలయం ముందు భాగంలో చూడచక్కని గోమాతలు, లేగదూడలు చూపరులను ఆకట్టుకునే విధంగా రూపొందించారు. ప్రస్తుతం గుడి నిర్మాణం పూర్తి కావాల్సి ఉండడంతో అంతవరకు గ్రామంలోని ఒక ప్రదేశంలో నవధాన్యాలలో శ్రీకృష్ణ విగ్రహాన్ని, శ్రీ మహాగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణం పూర్తయిన వెంటనే వివిధరకాల పూజలు, అభిషేకాలు, అర్చకులతో నిర్వహించి శ్రీకృష్ణుని మూలవిరాట్ విగ్రహకి ప్రాణప్రతిష్ట చేస్తారు. ప్రస్తుతం మిగిలి ఉన్న పనులు పూర్తికావడానికి ఇంకా రూ. 60 లక్షలు అవసరమవుతాయని.. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందిస్తే త్వరలోనే కృష్ణాలయాన్ని ప్రారంభించేందుకు మార్గం సుగమవుతుందిని ఆయన అన్నారు.
దాతల సహకారం మరువలేనిది..
శ్రీకృష్ణ దేవాలయాన్ని నిర్మించుటకు తమ వంతుగా దాతలు చేసిన సహాయం ఎప్పటికీ మరువలేనిది. దేవాలయం నిర్మాణంలో తమ వంతు సహాయ సహకారాలు అందించాలనే భక్తులు 9704321311నెంబర్ కు ఫోన్ చేసి తమవంతు సహాయ సహకారాలు అందించి శ్రీకృష్ణుడి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.
