TG | కాంగ్రెస్ ఒత్తిడితోనే కేంద్రం కులగ‌ణ‌న – డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క

ఖ‌మ్మం : కాంగ్రెస్ ఒత్తిడి చేయ‌డం వ‌ల్లే కేంద్రం కుల‌గ‌ణ‌న చేసేందుకు నిర్ణ‌యించింద‌ని, ఇది రాహుల్ గాంధీ సాధించిన విజ‌య‌మ‌ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని మల్లన్నపాలెం గ్రామంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ అభివృద్ధి పనులకు ఇవాళ‌ ఆయ‌న శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియా మాట్లాడుతూ… తెలంగాణలో కులగణన చేసి దేశానికి రోల్ మోడల్‌గా నిలిచామన్నారు. ప్రభుత్వం నిర్ణయాల్లో కులగణనను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. కులగణన సర్వే ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలునిచ్చారు.

అదేవిధంగా ప్రభుత్వానికి బీసీలు ఎల్లప్పడూ అండగా ఉండాలని కోరారు. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా సామాజిక అసమానతలు తొలగించడానికి దేశవ్యాప్తంగా కుల‌గణన చేయాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. కులగణన ఆధారంగా బీసీలకు రాజకీయ, విద్య‌, ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. కులగణన చేపట్టాలని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేస్తున్నా.. పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ప్రజల ఒత్తిడికి తలొగ్గి అందుకు ఒప్పుకుందని తెలిపారు. రాష్ట్రంలో తాము నిర్వహించిన కులగణనను ఇన్నాళ్లు అపహాస్యం చేసిన బీజేపీ ఇప్పుడు తమ దారిలోకి రావడం సంతోషకర పరిణామమని భట్టి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *