- హాజరైన లక్షలాదిమంది భక్తులు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనది బ్రహ్మ రథోత్సవం
- భక్తుల కోసం భారీగా అన్నదానాలు
- ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటుచేసిన పోలీసులు
శ్రీ సత్యసాయి బ్యూరో, మార్చి 20 (ఆంధ్రప్రభ) : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీవారి బ్రహ్మరథోత్సవం (తేరు) కన్నుల పండువగా జరిగింది. 15రోజులు పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు గురువారం ఉభయ దేవర్లతో కూడి బ్రహ్మ రథోత్సవంపై విహరించారు. ఆలయంలోని అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, అనంతరం శ్రీదేవి భూదేవి సమేత నారసింహుడిని బ్రహ్మరథంపై అధిష్టింపజేశారు.
బ్రహ్మరథం తేరు వద్ద అర్చకులు ఆగమన శాస్త్ర ప్రకారం విశిష్ట పూజలు చేశారు. పూజలకు స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, జిల్లా ఎస్పీ వి.రత్న, ఆలయ సహాయ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కదిరి ఆర్డీవో ఎస్ ఎస్ శర్మ, మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి, బీజేపీ నాయకులు వంశీ, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు హాజరయ్యారు. ఉదయం 9.15 నిమిషాలకు తిరువీధుల ఉత్సవానికి రథం కదిలింది. రథోత్సవానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. జయ జయ నినాదాల మధ్య దేవదేవుడు బ్రహ్మరథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వడం బ్రహ్మరథోత్సవం ప్రత్యేకత.
