ఎమ్మెల్యే పోటీకి వ‌యో ప‌రిమితి 21 ఏళ్లు..

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఎమ్మెల్యేగా పోటీ చేసే వారికి వయో పరిమితిని 25 నుంచి 21 ఏళ్ల తగ్గించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేస్తామని ప్రకటించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని సంస్మరణ కమిటీ చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.

వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కి ఈ సందర్భంగా సద్భావనా అవార్డును బహూకరించి సత్కరించారు. దేశ పరిపాలనా యంత్రాంగంలో 21 ఏళ్లకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు అసెంబ్లీకి పోటీ చేసే వయసును 21 ఏళ్లకు ఎందుకు తగ్గించరాదని ప్రశ్నించారు.

ప్రభుత్వాలను నిర్ణయించే అధికారం యువతకు ఉండాలన్న సంకల్పంతో రాజీవ్ గాంధీ ఓటు హక్కు వ‌యో పరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అదే క్రమంలో ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేసే వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశ సమగ్రతను, సమైక్యతను కాపాడటానికి రాజీవ్ గాంధీ త్యాగాలను గుర్తు చేస్తూ, గడిచిన 35 ఏళ్లుగా క్రమం తప్పకుండా సద్భావనా యాత్ర సంస్మరణ కార్యక్రమాన్ని జరుపుతున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి , సలహాదారులు షబ్బీర్ అలీ , హర్కర వేణుగోపాలరావు , ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి , ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply