Balotsavam | అదరహో అమరావతి బాలోత్సవం…

Balotsavam | అదరహో అమరావతి బాలోత్సవం…
- క్రిస్మస్, సంక్రాంతి కన్నా ముందే పిల్లల పండుగ…
- అట్టహాసంగా ప్రారంభమైన 8వ అమరావతి బాలోత్సవం..
- చిన్నారులను స్వతంత్ర భావాలతో ఎదగనీయాలి..
- మాక్ అసెంబ్లీతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు…
- బాలోత్సవం ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్…
- సాంస్కృతిక కార్యక్రమాలకు విశేష స్పందన….
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : ఎప్పుడెప్పుడా అని చిన్నారులు ఎదురుచూస్తున్న పిల్లల పండుగ అమరావతి బాలోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. మూడు రోజులపాటు సాగే చిన్నారుల పండుగలో ఆరవై అంశాలలో విద్యార్థులు భాగస్వామ్యులు కానున్నారు. మంగళవారం విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో అమరావతి బాలోత్సవం కనుల పండుగగా ప్రారంభమైంది.
కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సినిమా టోగ్రఫీ శాఖామంత్రి కందుల దుర్గేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బాలోత్సవం ప్రారంభ కార్యక్రమంలో భాగంగా త్రివర్ణ పతాకంతో పాటు అమరావతి బాలోత్సవం జెండాను మంత్రి ఎగురవేశారు.
కార్యక్రమంలో భాగంగా సిద్ధార్థ కళా పీఠానికి కోటి మొక్కలు నాటిన వనజీవి పద్మశ్రీ దరిపల్లి రామయ్య వేదికగా జ్ఞాపకార్థం నామకరణం చేశారు. కార్యక్రమానికి అమరావతి బాలోత్సవం ప్రధాన కార్యదర్శి రామిశెట్టి కొండలరావు సభా అధ్యక్షత వహించారు. రాష్ట్ర విభజన అనంతరం అమరావతి బాలోత్సవ ఏర్పాటు ఆవశ్యకత అంశాలను కార్యక్రమానికి వచ్చిన అతిథులతో పాటు ఆహ్వానితులకు తొలి పలుకులుగా అందించారు.
9,10,11 తేదీలలో మూడు రోజులపాటు నిర్వహించే పిల్లల పండుగలో ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన 300 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి సుమారుగా 15 వేల మంది విద్యార్థులు అమరావతి బాలోత్సవంలో పాల్గొంటున్నారని వెల్లడించారు.
అనంతరం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులనుద్దేశించి ప్రసంగించారు. ప్రతి వ్యక్తి జీవితంలోనూ బాల్యం మధురమైన జ్ఞాపకం అని గుర్తు చేశారు. చిన్నారులను స్వతంత్ర భావాలతో ఎదగనించినప్పుడే వారిలో దాగి ఉన్న సృజనాత్మక శక్తి వెలుగు చూస్తుందన్నారు.
ఆటపాటలతో కూడిన చదువు శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందని గుర్తు చేశారు. అమరావతి బాలోత్సవం నిర్వహిస్తున్న పిల్లల పండుగకు సమాజంలో విశేష స్పందన లభించడం హర్షనీయమన్నారు. తనవంతుగా అమరావతి బాలోత్సవం నిర్వహించే కార్యక్రమాలకు ఎల్లప్పుడు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.
ప్రతి విద్యార్థుల్లోనూ నాయకత్వ లక్షణాలు పెంపొందించే క్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలోనూ మాక్ అసెంబ్లీ కార్యక్రమాలు నిర్వహించే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగం పట్ల చూపిస్తున్న శ్రద్ధ శక్తులు నూతన విద్యారంగానికి పునాదులు వేస్తున్నాయని గుర్తు చేశారు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్దిక భరోసానిస్తున్నామన్నారు.
అంతే కాకుండా పేరెంట్, టీచర్స్ మీట్ కార్యక్రమం ద్వారా విద్యార్థులు వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించడంతోపాటు పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు అవుతుందన్నారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందని గుర్తు చేశారు.
అమరావతి బాలోత్సవం నిర్వహిస్తున్న అంశాలలో చిన్నారులు భాగస్వామ్యులు కావటం సంతోషాన్నిస్తుందన్నారు. చిన్నారులపై తల్లిదండ్రులు వారి ఆలోచనలను బలవంతంగా రుద్దే ప్రక్రియ మానుకోవాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్ విద్యార్థులు ఒకచోట చేరడం ద్వారా వారిలో అసమానతలు తొలగి నవ్య సమాజానికి దోహదపడినట్లు అవుతుందన్నారు. బాలల హక్కుల పరిరక్షణ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు.
కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ పిల్లలు దేవుళ్ళతో సమానం అన్నారు. తెలుగుజాతి ముద్దుబిడ్డలను ప్రపంచం గర్వించదగ్గ విధంగా తీర్చిదిద్దాల్సిన అవసరం మనందరిపై ఉందని పేర్కొన్నారు. కలలు కనండి – వాటిని సాకారం చేయండి అన్న భారతరత్న అబ్దుల్ కలాం వ్యాఖ్యలను నిజం చేస్తూ విద్యార్థులు జీవితంలో రాణించాలని పేర్కొన్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీసర్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ…. విద్యార్థులకు తల్లిదండ్రులు మార్గదర్శకులుగా నిలవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. చదువుని ఇష్టంతో చదవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన జానపద, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి.
విద్యార్థులు మట్టి ముద్దలతో వివిధ కళాకృతులను అద్భుతంగా మలిచారు. వ్యాసరచన, వ్వక్తి్తృత్వం,కథా రచన, కార్టూనిస్ట్, అంతర్జాలంలో అన్వేషణ, విచిత్ర వేషధారణ,లఘునాటిక దేశభక్తి గీతాలాపనలు, క్లాసికల్ డాన్స్, ఫాన్సీ డ్రస్ వంటి వివిధ అంశాలపై నిర్వహించిన కార్యక్ర మాలలో విద్యార్థులు పాల్గొని ఉత్సాహం కనబరిచారు.
మూడు రోజులపాటు జరిగే పిల్లల పండుగలో ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన 200 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి సుమారుగా 15 వేల మంది విద్యార్థులు అమరావతి బాలోత్సవం పాల్గొననున్నారని నిర్వాహకులు వెల్లడించారు.
కార్యక్రమంలో అమరావతి బాలోత్సవం ప్రతినిధులు ఎస్ పి రామరాజు, మురళీకృష్ణ, నాగళ్ళ విద్యా కన్నా , కే.యతిరాజు నాయుడు నవ స్కంద డెవలపర్స్ బెంగళూరు, బండి రాజేష్ నైరా ఇన్ఫ్రాహైట్స్ బెంగళూరు , చలసాని ఆంజనేయులు చైర్మన్ కృష్ణ మిల్క్ యూనియన్ , జి ఎస్ రామ్మోహన్రావు క్రేడాయ్ అధ్యక్షులు, కే రఘురాం క్రీడాయి కార్యదర్శి, అమరావతి బాలస్వామి ఆఫీస్ బేరర్స్ తదితరులు పాల్గొన్నారు.





