• శాంతి భద్రతల సరేసరి
  • గంజాయి దందా యథాతథం
  • ట్రాఫిక్కు చిక్కులూ అంతే
  • రాజకీయ ఉచ్చు తప్పదు

మచిలీపట్నం, ఆంధ్రప్రభ ప్రతినిధి : కృష్ణాజిల్లా ఎస్పీగా తాను ఉన్నంతకాలం శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నేరస్తులను కఠినంగా శిక్షించడం, జిల్లాలో గంజాయి లేకుండా చేయడం తదితర వాటిని కచ్చితంగా అమలు జరుపుతానని నాలుగు రోజుల కిందట కృష్ణా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన విద్యాసాగర్(Vidyasagar) నాయుడు చెప్పారు. ఆయన ఆలోచనలను ఆయన చేపట్టబోయే కార్యక్రమాలను జిల్లా పోలీసు శాఖ సిబ్బంది, అధికారులు అంకిత భావంతో పనిచేయడానికి కచ్చితంగా చేయూతనివ్వాలి.

అలా జరిగిన నాడు నిజంగానే కృష్ణాజిల్లా ‘శాంతి’ జిల్లాగా గుర్తింపు పొందుతుంది. కృష్ణాజిల్లాలో ఎస్పీ పలు సమస్యలను పరిష్కరించవలసి ఉంది. జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్(Traffic) సమస్యను పరిష్కరించవలసి ఉంది. ప్రధానంగా వీటితో పాటు జూదాలు, ఇసుక అక్రమ రవాణా పై నిఘా పెట్టి అణచి వేయాలి. మరో ప్రధానమైన సమస్య పశువుల సంచారం.

ఈ పశువుల సంచారాన్నిఅరికట్టడంపై ఏ పోలీస్ అధికారి ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదు. అందుకు ప్రధాన కారణం రాజకీయాలే! కృష్ణాజిల్లా(Krishna District)లోని అన్నిమున్సిపాలిటీలతో పాటు మచిలీపట్నం నగరంలో కూడా ఈ పశువుల సంచారం వల్ల అనేకమంది ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రాణాలు పోయిన వారు కూడా ఉన్నారు. పశువుల సంచారాన్నిఅరికట్టడానికి పలుమార్లు పశువుల యజమానులతో పోలీసు అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసి కేసులు పెడతామని హెచ్చరించినా ఫలితం లేకపోయింది. బందరులో పగలు, రాత్రి అనే బేధం లేకుండా పశువులు సంచరిస్తున్నాయి.

మెయిన్ రోడ్డు( Main Road)తో పాటు బైపాస్ రోడ్ లో కోనేరు సెంటర్ నుంచి మూడు స్తంభాల సెంటర్ వరకు, జిల్లా పరిషత్ నుండి చింతచెట్టు వరకు, తుళ్ళు సెంటర్ నుండి కాలే ఖాన్ పేట వరకు, ఇలా పలు సెంటర్లలో పశువులు తిష్ట వేసి ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. పలుమార్లు పోలీస్ అధికారులు, నగరపాలక సంస్థ అధికారులు పశువుల యజమానులతో సమావేశాలు ఏర్పాటు చేసి పశువుల ను యదేచ్చగా వదిలిపెట్ట వద్దని హెచ్చరికలు చేసిన ఫలితం లేకుండా పోయింది.

గంజాయి సరే సరి

మచిలీపట్నం తో పాటు అన్ని మున్సిపాలిటీలలో గంజాయి అమ్మకాలు విపరీతంగా జరుగుతున్నాయి. మచిలీపట్నంలో దాదాపు 50 మందికి పైగా గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం. నలుగురు ఐదుగురు కలిసి మధ్యవర్తి ద్వారా 500 రూపాయలు ఖర్చుపెట్టి గంజాయి తెప్పించుకుంటున్నారు. కిళ్ళీ సైజులో గంజాయి(Ganjai) ఆకులు చుట్టి లేదా పొడి చేసి అమ్ముతారు.

గంజాయి తీసుకున్న అతి తక్కువ సమయంలోనే తీసుకున్న వారి శరీరం అదుపులో ఉండదని, ఏదేదో చేయాలన్న ఆలోచనలు, ఎవరి మీద నైనా కసి కోపం ఉంటే వారిని కొట్టేయాలన్న ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అటువంటి సమయంలో విచక్షణ కోల్పోయి వింతగా ప్రవర్తిస్తారని ఒక యువకుడు తన అనుభవాలను వెల్లడించాడు. గంజాయి మత్తులో తాము ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో తెలియనంతగా శరీరం ఊగిపోతూ, తూలిపోతూ ఉంటుందని ఆ యువకుడు చెప్పాడు.

బందరులోనూ ..గం‘జాయ్ ’

మచిలీపట్నం నగరంలో ఉన్న 50 డివిజన్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా డ్రైవర్స్ కాలనీ, గుమస్తాల కాలనీ, ఓగీసు పేట, బాబే ఖాన్ పేట, రైల్వే స్టేషన్(Railway Station), చిలకలపూడి, వైయస్సార్ కాలనీ, బైపాస్ రోడ్డు, బలరాముని పేట ప్రాంతాలతో పాటు ఇంకా పలుచోట్ల గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు, వివిధ రకాల వృత్తులలో ఉండి పనిచేసుకునే యువకులు ఈ గంజాయి మత్తు( intoxication)లో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

గంజాయి ఎక్కడి నుంచి ఎలా తీసుకొచ్చి ఎవరు అమ్ముతున్నారో పలువురు పోలీసులకు తెలుసు నన్ను అభిప్రాయం చాలామందిలో అనుమానాలు ఉన్నాయి. పోలీసులకు తెలిసిన వారు ఎటువంటి చర్యలు తీసుకోరు. ఎందుకంటే వారికి నెల నెల మామూలు బాగా అందుతాయి.

సిగ్నల్స్.. ఉత్సవ విగ్రహాలే..

ట్రాఫిక్ ను కచ్చితంగా అమలు జరపాలి. సిగ్నల్ లైట్లను చాలాకాలం కిందటే ఏర్పాటు చేశారు. వాటిని వినియోగంలోకి మాత్రం తీసుకురాలేదు. నగరంలో జనాభా పెరగడం, చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి పనుల మీద ప్రతిరోజు వందల సంఖ్యలో జనం వస్తూ ఉండటం వల్ల రద్దీ పెరుగుతోంది. వాహనాల సంఖ్య కూడా పెరిగింది. మచిలీపట్నం(Machilipatnam) రైల్వే స్టేషన్ నగరానికి కాస్త దూరంగా ఉన్నందున ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకోవాలంటే ఆటోలకు ఎక్కువగా ఖర్చు చేసుకోవలసి వస్తుంది. గతంలో మెయిన్ రోడ్డులో(Main Road) రైల్వే స్టేషన్ కౌంటర్ ఉండేది. ప్రయాణికులకు రిజర్వేషన్ చేసుకోవటానికి అందుబాటులో ఉండేది. నెలకు లక్ష రూపాయలు రిజర్వేషన్ కౌంటర్ వల్ల నష్టం వస్తుందన్న షాపుతో రైల్వే అధికారులు ఆ కౌంటర్ ను మూసేశారు. దీనివల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ఇక మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుంచి ప్రతి రోజు హైదరాబాద్, తిరపతి, విశాఖపట్నం, యశ్వంతపూర్ (బెంగళూరు) కు రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. ఈ రైళ్లు (యశ్వంతపూర్) మినహా రాత్రులు మచిలీపట్నం నుంచి వెళ్లి తిరిగి మరసటి రోజు మచిలీపట్నం చేరుకుంటాయి. ఆ సమయాలలో బస్టాండ్( Bus Stand) నుంచి లేదా నగరంలోని ఇతర డివిజన్లో నుంచి రైల్వే స్టేషన్ కు వెళ్లాలంటే ఆటోవాలాలు విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.

ఇతర సమయాలలో కూడా రైళ్లు విజయవాడకు వెళతాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని రైల్వే స్టేషన్ కు ఇంత రేట్ అని నిర్ణయించి ఆటోలు నడిచే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే నగరంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఆటోలు ఇంత చార్జీ వసూలు చేయాలని కచ్చితంగా నిర్ణయించాలి. ఇలా చేసినట్లయితే ప్రయాణికులు చాలా సంతోషిస్తారు.

వాహనాల తనిఖీలు మామూలే

నగరంలో తిరిగే వాహనాలను పగలు రాత్రులు కూడా కచ్చితంగా తనిఖీలు(Checks) చేయాలి. దీంతో పాటు వాహనదారులను బ్రీత్ ఎనలైజర్లతో పరిశీలించాలి. అపరాధ రుసుముతో పాటు శిక్షలు వేయాలి. వీటివల్ల నేరాల సంఖ్య తగ్గడమే కాకుండా అపరాధ రుసుం వల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది.

జిల్లా ఎస్పీ దృష్టి అవసరం

పై సమస్యలను దృష్టిలో పెట్టుకుని జిల్లా ఎస్పీ ఇతర అధికారులతో సంప్రదించి చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తాయి. అధికారులు పోలీసులు సిబ్బంది తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తే పోలీసు శాఖ ప్రతిష్ట పెరుగుతుంది. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ సారధ్యంలో అందరూ కలసి పనిచేస్తే కృష్ణాజిల్లాకు మంచి పేరు వస్తుంది. ప్రజలు సంతోషిస్తారు.

Leave a Reply