అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై తప్పిన భారీ ప్రమాదం

అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై తప్పిన భారీ ప్రమాదం
ఎస్‌బిఐ బ్యాంక్ వద్ద కారు బీభత్సం
నకరికల్లు, ఆంధ్రప్రభ : అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై మంగళవారం సాయంత్రం భారీ ప్రమాదం తృటిలో తప్పింది. ఒంగోలు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న థార్ కారును వెనుక నుండి లారీ బలంగా ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఒంగోలు నుంచి హైదరాబాద్ మార్గంలో ప్రయాణిస్తున్న థార్ కారును ఎదురుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న వారిని తప్పించే క్రమంలో వెనుక నుండి వస్తున్న ఒక లారీ బలంగా ఢీకొట్టింది. లారీ ఢీకొన్న వేగానికి థార్ కారు అదుపుతప్పి, రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను దాటుకుని అవతలి వైపుకు దూసుకెళ్లింది. అక్కడే టీ తాగేందుకు ఆగి ఉన్న మరో కారును ఢీకొంటూ, ఎస్‌బిఐ బ్యాంక్ పక్కనే ఉన్న కిరాణా షాపు వద్దకు దూసుకెళ్లి ఆగిపోయింది.
ఆ సమయంలో ఆ ప్రాంతం రద్దీగా ఉండటంతో ఒక్కసారిగా కారు దూసుకురావడాన్ని చూసిన ప్రజలు భయంతో పరుగులు తీశారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినప్పటికీ అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద ధాటికి థార్ కారు ముందు భాగం, అద్దం పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
