మేరా యువ భారత్ కు తారా విద్యార్థులు

మేరా యువ భారత్ కు తారా విద్యార్థులు
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : మేరా యువభారత్ కార్యక్రమానికి సంగారెడ్డి తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఈనెల 12, 13 తేదీల్లో హైదరాబాద్ సమీపంలోని కన్హా శాంతి వనంలో నిర్వహించబడనున్న మేరా యువ భారత్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తారా కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.ప్రవీణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం యువతను పరిపాలనలో భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో నిర్వహించిన బడ్జెట్ క్వెస్ట్ లో దేశవ్యాప్తంగా 12 లక్షలకుపైగా యువత పాల్గొన్నారని ఆయన తెలిపారు. ఆ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన వారిలో కొద్దిమందిని మాత్రమే ఎంపిక చేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆన్‌లైన్‌లో సంభాషించే అవకాశం కల్పించారని వివరించారు.
ఈ ఎంపికలో తారా కళాశాలకు చెందిన సాధన్ సదాఫ్ (బి ఎ. ప్రథమ సంవత్సరం), తనుజ్ గౌడ్ (బీకాం ద్వితీయ సంవత్సరం), అఖిల (బీకాం ప్రథమ సంవత్సరం) ఎంపిక కావడం గర్వకారణమని తెలిపారు. దేశంలోని 17 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరుగుతుండగా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించిన కార్యక్రమం హైదరాబాద్ సమీపంలోని కన్హా శాంతి వనంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 12న సాయంత్రం విద్యార్థులు మాక్ పార్లమెంట్‌లో పాల్గొనే అవకాశం పొందగా, 13న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యక్ష ఆన్‌లైన్ సంభాషణలో పాల్గొనే అరుదైన అవకాశం లభించనుంది. ఈ విజయంపై కళాశాల వైస్ ప్రిన్సిపల్స్ నిర్మల, డాక్టర్ జగదీశ్వర్, ఎన్‌ఎస్ఎస్ అధికారులు, అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు.

