హైదరాబాద్, ఆంధ్రప్రభ : దేశంలోనే అమానుష చర్య ఫోన్ ట్యాపింగ్ అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం ఒక న్యూస్ చానెల్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక న్యూస్ చానెల్ కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని అన్నారు. ఛానల్‌పై గుండాలు, రౌడీల్లా దాడి దుర్మార్గమని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్‌తో ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీఆర్ఎస్ నేతల పన్నాగం పన్నారని అన్నారు. రాజకీయ నాయకులు సినీతారలు, జడ్జీలు, మహిళా ఐఏఎస్ అధికారులు, చివరకు సొంత పార్టీ నేతల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఈ ఫోన్ ట్యాపింగ్‌లు చేయడం అనేది దేశ చరిత్రలో అమానుష చర్య.
వ్యక్తిగతాన్ని హరించిన ఫోన్‌ట్యాపింగ్
రాజకీయ నేతల అడుగులకు మడుగులు ఒత్తే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును వెసులుబాటు కోసం ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చారని మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌తో వ్యక్తిగత స్వేచ్చను హరించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌కి బాధ్యులు ప్రభాకర్, రాధాక్రిష్ణ మాత్రమే కాదు.. అప్పటి సీఎం, మంత్రివర్గం, అధికారులు, డీజీపీ, లీగల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హోంసెక్రటరీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.