హైదరాబాద్ – బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డికి టీజీపీఎస్సీ షాక్ ఇచ్చింది. గ్రూప్-1 ఫలితాల విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ పరువు నష్టం దావా నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో ఈ నోటీసులకు సమాధానం ఇచ్చి, క్షమాపణలు చెప్పాలని, లేదంటే పరువు నష్టం కేసులు, ఇతర క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ఇకపై టీజీపీఎస్సీపై రాకేశ్ రెడ్డి ఎలాంటి ఆరోపణలు చేయవద్దని ఆ నోటీసుల్లో పేర్కొంది. సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టవద్దని కూడా తెలిపింది.
రాకేశ్ రెడ్డి ఏమన్నారు?
టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్‌లోని అన్ని పేపర్లను రీవ్యాల్యుయేషన్ చేయాలని ఏప్రిల్ 1వ తేదీన రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. పరీక్ష నిర్వహణ, వాల్యుయేషన్‌లో తప్పిదాలు జరిగాయని, వాటిని సరిదిద్దుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. గ్రూప్-1లో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందని, 40 శాతం మంది విద్యార్థుల్లో టాప్ 500లో ఒక్కరు కూడా లేరని ఆయన అన్నారు.
45 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తే కేవలం 10, 15 కేంద్రాల్లోని అభ్యర్థులే టాపర్లుగా నిలిచారని, మిగతా కేంద్రాల్లోని వారు ఎందుకు లేరని ప్రశ్నించారు. ఏపీపీఎస్సీలో 6 వేల పేపర్లు దిద్దడానికి 40 రోజుల సమయం తీసుకుంటే, ఇక్కడ 20 వేల పేపర్లను తక్కువ సమయంలో ఎలా దిద్దగలిగారని రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు.