TG TET 2025| తెలంగాణ‌ టెట్ షెడ్యూల్ విడుద‌ల

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) 2025 పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ పరీక్షలు జూన్ 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా రెండు షిఫ్ట్‌ల్లో జరగనున్నాయి. పరీక్షలు రెండు పేపర్లుగా – పేపర్–1, పేపర్–2 విభజించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం జిల్లాల వారీగా పరీక్షల తేదీలు, సబ్జెక్టులు కేటాయించబడ్డాయి.

పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఒక షిఫ్ట్‌, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు మరో షిఫ్ట్‌లో జరుగుతాయి. పేపర్–1ను రాయబోయే అభ్యర్థులు, ఐదో తరగతి వరకు బోధించాలనుకునే వారు కాగా, పేపర్–2ను రాయబోయే వారు ఆరో తరగతి పైగా బోధించాలనుకునే అభ్యర్థులు. పేపర్లు ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో ఉండగా, కొన్ని సబ్జెక్టులకు హిందీ, కన్నడ, తమిళం, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, సంస్కృతం మాధ్యమాలకూ అవకాశం కల్పించారు.

జూన్ 18న ప్రారంభమయ్యే టెట్ పరీక్షలు మొదటగా మాథమెటిక్స్ & సైన్స్ (పేపర్–2) పరీక్షతో ప్రారంభమవుతాయి. వరుసగా 16 సెషన్లలో వివిధ సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. చివరి రోజైన జూన్ 30న మైనారిటీ భాషల్లో పేపర్–2 మాథమెటిక్స్, సైన్స్ & సోషల్ స్టడీస్ పరీక్షలు జరగనున్నాయి.

ప్రతి జిల్లాలోని కేంద్రాలను స్పష్టంగా పేర్కొంటూ, సంబంధిత సబ్జెక్టుల పరీక్షలు ఏ తేదీన జరిగేలా కేటాయించారో విద్యార్థులకు వెల్లడించారు. నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, సిరిసిల్ల, మంచిర్యాల, ములుగు, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, జగిత్యాల, పటాన్‌చెరు, సంగారెడ్డి వంటి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు షెడ్యూల్‌లో తెలిపారు.

ఈ షెడ్యూల్ ప్రకారం పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తమ జిల్లాకు అనుగుణంగా తేదీలను గమనించి సన్నద్ధం కావాలని అధికారులు సూచించారు. త్వరలో హాల్‌టికెట్లు విడుదల కానుండగా, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది.

Leave a Reply