హైదరాబాద్ – బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వ వైఖరితో అన్ని వర్గాల ప్రజలు కష్టాలు, ఇబ్బందుల పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద సనత్ నగర్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ సర్వ సభ్య సమావేశం తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత బి ఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పుట్టిన బి ఆర్ ఎస్ పార్టీ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ పండుగను ఈ నెల 27 వ తేదీన ఘనంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు.
27 వ తేదీన ఉదయం 10.00 గంటలకు అన్ని డివిజన్ లలో తోరణాలు, జెండాలతో అత్యంత సుందరంగా అలంకరణ చేసి జెండాలను ఆవిష్కరించాలని అన్నారు. అనంతరం వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి లో జరిగే పార్టీ రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కెసిఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు.
10 సంవత్సరాల బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వ పాలనను చూసిన ప్రజలు మళ్ళీ కెసిఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. 15 నెలల పాలనతోనే అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం తో విసిగిపోయారని అన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి పేదలు ఫుట్ పాత్ లపై చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని నానా ఇబ్బందులు పెడుతుందని ధ్వజమెత్తారు.
బి ఆర్ ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందన్న విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మీ, కుర్మ హేమలత, టి.మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్, డివిజన్ పార్టీ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, కొలన్ బాల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వెంకటేషన్ రాజు, హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.