జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ బృందం కిటాక్యుషు మేయర్‌ను కలుసుకున్నారు. నగర మేయర్ కజుహిసా టకేచి తెలంగాణ బృందానికి సాంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల మంత్రి డి. శ్రీధర్ బాబు, అధికారులను మేయర్ స్వాగతించారు.
ఒకప్పుడు జపాన్‌లో అత్యంత కాలుష్య నగరంగా ఉన్న కిటాక్యూషులో విషపూరితమైన గాలి, నీరు, నేల ఉండేవి. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం అమలు చేసిన పరిరక్షణ విధానాలతో ఇప్పుడు ఈ నగరం పర్యావరణ పరిరక్షణలో ప్రపంచంలోనే అత్యుత్తమ ఉదాహరణగా మారింది.
పర్యావరణ పరిరక్షణ, రీసైక్లింగ్ ఆవిష్కరణలు, సుస్థిరత పరంగా కిటాక్యుషు నగరం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. పర్యావరణ పునరుజ్జీవనానికి, సుస్థిర నగర అభివృద్ధికి ఒక ఆదర్శ నమూనాగా మారింది. కాలుష్యం నుంచి బయటపడేందుకు కిటాక్యుషు నగరంలో అమలు చేసిన విధానాలను, ప్రస్తుతం పాటిస్తున్న జాగ్రత్తలను మేయర్ నేతృత్వంలోని బృందం ముఖ్యమంత్రి కి వివరించింది.