TG | కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఏడాది నుంచే ఉత్పత్తులు – కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

హనుమకొండ – కాజీపేట మెగాకోచ్ ఫ్యాక్టరీ పనులను డిసెంబర్ లోగా పూర్తి చేస్తామని, 2026 లో ఇక్కడి నుండి కోచ్ ల ఉత్పత్తి ప్రారంభిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. త్వరలో కాజీపేట నుండి 150 లోకోమోటివ్ లు కూడా ఎగుమతి అవుతాయని అన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (RMU) ను నేడు కేంద్ర మంత్రి పరిశీలించారు..

ముందుగా శంకర్ పల్లి రైల్వే స్టేషన్ నుండి కాజీపేట రైల్వే స్టేషన్ వరకు రైలు మార్గంలో ప్రయాణించి, అనంతరం కోచ్ ఫ్యాక్టరీని నిర్మాణ స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలో 750 కోట్ల రూపాయలతో రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో ఇదో పెద్ద ప్రాజెక్టు అని చెప్పిన కేంద్రమంత్రి.. ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. దేశంలోనే ఇది పెద్ద రైల్వే మానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని.. వందేభారత్ బోగీలు కూడా ఇక్కడే తయారవుతాయని మంత్రి వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భారతీయ రైల్వేలు పురోగమిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు.

కాజీపేట మానుఫ్యాక్చరింగ్ యూనిట్ తెలంగాణ ప్రజల చాలా ఏళ్ల కల అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘ఇక్కడి ప్రజల ఆకాంక్ష నెరవేర్చాం. ఇక్కడ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం, ఉపాధి కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. వాళ్ల సిఫార్సు మేరకు ఉద్యోగాలు కల్పిస్తాం. మోదీ చేస్తున్న అభివృద్ధి.. కళ్లున్న వాళ్లు చూడాలి, చెవులన్న వాళ్లు వినాలి. లేదంటే ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకోండి. మామునూరు ఎయిర్ పోర్ట్ కోసం భూములు ఎంత త్వరగా అప్పగిస్తే అంత త్వరగా ఎయిర్ పోర్ట్ లో విమానాలు ఎగురుతాయి’ అని కిషన్ రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , రాష్ట్ర బిజెపి అధ్యక్షులు రామచందర్ రావ్, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి , ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మ్మెల్యేలు పాల్వాయి హరీష్ ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

One thought on “TG | కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఏడాది నుంచే ఉత్పత్తులు – కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Leave a Reply