TG MLC Elections | ప‌ట్ట‌భ‌ద్రులు ప‌ట్టం క‌ట్టిందెవ‌రికో?

ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న బీజేపీ
రిఫ‌రెండంగా తీసుకున్న కాంగ్రెస్‌
ఎన్నిక‌ల‌కు దూరంగా బీఆర్ఎస్‌
నేటితో ముగియ‌నున్న ప్ర‌చారం డ‌బ్బుల‌తో విద్యావంతుల‌కు ఎర‌

సెంట్ర‌ల్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌ : తెలంగాణ‌లో అధికార కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధంతో రాజ‌కీయ‌వాతావ‌ర‌ణం వేడేక్కుతోంది. ఈ నేప‌థ్యంలో వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, కరీంనగర్‌- మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల‌కు ఈ నెల 27వ తేదీన ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ను బ‌రిలో ఉన్న అధికార కాంగ్రెస్‌, బీజేపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. గ్రాడ్యుయేట్‌ నియోజవకర్గంలో 3,41,313 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 2,18,060 మంది పురుషులు, 1,23,250 మంది మహిళలు, ఇతరులు ముగ్గురు ఉన్నారు. ఈ ఎన్నిక‌ల‌కు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంది. ఈ స్థానం గెలుచుకోవాల‌ని కాంగ్రెస్‌, బీజేపీ శాయ‌శ‌క్తులు కృషి చేస్తున్నాయి. ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేష్ కుమార్ గౌడ్‌, మంత్రులు పాల్గొన్నారు. అలాగే బీజేపీ అభ్య‌ర్థి త‌రుఫున కేంద్ర మంత్రులు కిషాన్‌రెడ్డి, బండి సంజ‌య్ కుమార్ విస్తృతంగా ప్ర‌చారం చేశారు. మంగ‌ళ‌వారం సాయంత్రంతో ప్ర‌చారానికి తెర‌ప‌డుతుంది.

అభ్య‌ర్థులు.. ఓట‌ర్ల వివ‌రాలు
వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, కరీంనగర్‌- మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు ఈ నెల 27న పోలింగ్‌ జరుగనుంది. వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక బరిలో 19 మంది అభ్యర్థులు, కరీంనగర్‌- మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌ గ్రాడ్యుయేట్‌ స్థానానికి 56 మంది, టీచర్‌ స్థానానికి 15 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కరీంనగర్‌ గ్రాడ్యుయేట్‌ నియోజవకర్గంలో 3,41,313 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 2,18,060 మంది పురుషులు, 1,23,250 మంది మహిళలు, ఇతరులు ముగ్గురు ఉన్నారు. అదేవిధంగా కరీంనగర్‌ ఉపాధ్యాయ నియోజకవర్గంలో మొత్తం 25,921 మంది ఓట్లర్లు ఉన్నారు. నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 25,797 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 14,940 మంది పురుషులు, 9965 మంది మహిళలు ఉన్నారు.

ఆ ఒక్క స్థానం కోసం పోటాపోటీ
ఉపాధ్యాయ ఎమ్మెల్సీల‌కు యూనియ‌న్ల ఆధారంగా అభ్య‌ర్థులు గెలిచే అవ‌కాశం ఉంటుంది. అయితే గ్రాడ్యూట్ ఎమ్మెల్సీ స్థానం కోస‌మే పోటాపోటీ జ‌రుగుతుంది. ప్రధానంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టుగా జ‌రుగుతుంది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల‌ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి 56 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి అంజిరెడ్డి పోటీలో ఉండగా స్వతంత్ర అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. బీసీ వాదంతో ముందుకు వెళ్తున్న ప్రసన్న హరికృష్ణ ప్రచారంలోనూ, పట్టభ‌ద్రుల‌ను నేరుగా కలవడంలోనూ ప్రధాన పార్టీల అభ్యర్థులకు దీటుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నరేందర్ రెడ్డి స్థానిక నేతల సహకారంతో ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. పార్టీ శ్రేణులపై భరోసాతో ఉన్నారు. విద్యాసంస్థల అధినేత కావడంతో ప్రైవేట్ విద్యాసంస్థలు పనిచేస్తున్న వారి ఓటుతో పాటు యాజమాన్యాల సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కూడా వ్యాపార సంఘం నుంచి వచ్చారు. బీజేపీ ఎంపీలను ప్రధానంగా నమ్ముకొని ముందుకు సాగుతున్నారు. బీజేపీ శ్రేణులు కూడా కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఓటు కోసం కష్టపడుతున్నారు. ప్రధానంగా పోటీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి , ప్రసన్న హరికృష్ణ మ‌ధ్య జ‌రుగుతుంది. అయితే ప‌ట్ట‌భ‌ద్రులు ఎవ‌రికి ప‌ట్టం క‌డ‌తారో అనేది ప‌రిశీల‌కులు ఎదురు చూస్తున్నారు.

బీజేపీకి ప్ర‌తిష్ఠాత్మ‌కం.. కాంగ్రెస్‌కు రిఫ‌రెండం
ఎమ్మెల్సీ ప్ర‌చార శైలి ప‌రిశీలిస్తే ఈ ఎన్నిక‌లను బీజేపీ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకోగా, కాంగ్రెస్ రిఫ‌రెండంగా తీసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. సోమ‌వారం మూడు జిల్లాల్లో ప్ర‌చారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌సంగం ప‌రిశీలిస్తే ఇదే అర్థ‌మ‌వుతుంది. తాను ఇచ్చిన హామీలు నెర‌వేర్చిన‌ట్లు మీకు న‌మ్మ‌కం ఉంటే కాంగ్రెస్ అభ్య‌ర్థిని గెలిపించాల‌ని పిలుపునిచ్చారు. ఎనిమిదేళ కాలంలో ఇచ్చిన ఉద్యోగాలు, రైతు భ‌రోసా, స‌న్న‌బియ్యం బోన‌స్ ఇలా ప‌థ‌కాల‌ను వివ‌రిస్తూ మేథావులైన గ్రాడ్యూయెట్ ఓట‌ర్లు ఆలోచించాల‌న్నారు. ఒక‌వేళ తాను ప‌థ‌కాలు ఇవ్వ‌లేద‌ని న‌మ్మ‌కం ఉంటే కాంగ్రెస్‌కు ఓటు వేయ‌కుండా, ఇత‌ర పార్టీల‌కు ఓటు వేసుకోవాల‌ని సూచించారు. దీనిబ‌ట్టి త‌న ప‌ది నెల‌ల పాల‌న‌పై ఓట‌ర్ల‌కు రిఫ‌రెండం కోరిన‌ట్లు అర్థం చేసుకోవ‌చ్చు. సీఎం రేవంత్ రెడ్డి పాల‌న‌పై అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ ఇద్ద‌రూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌ట్ట‌భ‌ద్రుల‌ ఎమ్మెల్సీ స్థానం ద‌క్కించుకుని ఆ రెండు పార్టీల‌కు స‌మాధానంగా చూపించాల‌ని రేవంత్ రెడ్డి ఎత్తుగ‌డ‌. బీజేపీ విష‌యానికి వ‌స్తే… ఇద్ద‌రు కేంద్ర మంత్రులు కిష‌న్‌రెడ్డి, బండి సంజ‌య్ అన్ని ప‌క్క‌న పెట్టి ప్ర‌చారం కోసం ఎక్కువ స‌మ‌యం వెచ్చించారు. అంటే ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న‌ట్లే. ఈ ఎన్నిక‌ల‌కు బీఆర్ఎస్ దూరంగా ఉంది కాబ‌ట్టి, ఆ పార్టీ కాకుండా కాంగ్రెస్ టార్గెట్‌గా విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఓట‌ర్ల‌కు ఎర‌
గెలుపే ప్రధానంగా రంగంలోకి దిగిన అభ్యర్థులు ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం లేదు. ఎమ్మెల్యే ఎన్నికలను తలపించే విధంగా భారీ ఎత్తున డబ్బు పంచేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని తెలిసింది. గడిచిన రెండు రోజులుగా కీలకమైన వ్యక్తులతో సమావేశాలు ఏర్పాటు చేసి డబ్బులతో బేరసారాలు కుదుర్చుకున్నారు. ఇక రంగంలోకి దిగి పట్టభద్రులకు ఓటుకు రూ. 2 వేల నుంచి రూ.3వేలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రెండు రోజులుగా పంపకాలు కూడా మొదలైనట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మొన్నటి వరకు విందులతో నెట్టుకొచ్చిన అభ్యర్థులు ఇక డబ్బును ప్రధాన అస్త్రంగా రంగంలోకి దిగారు. ఏమైనా ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ గా మారి ఆసక్తి రేపుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *