TG | శ్రీశైలం ట‌న్నెల్ ప్ర‌మాదం దుర‌దృష్ట‌క‌రం – ఎమ్మెల్సీ క‌విత ..

నిజామాబాద్‌: శ్రీశైలం టెన్నెల్ లో ప్ర‌మాదం చోటు చేసుకోవడం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని అన్నారు బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ క‌విత .. ఈ సంఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన వారికి మెరుగైన చికిత్స అందించాల‌ని కోరారు. అలాగే లోప‌ల చిక్కుకుపోయిన కార్మికుల‌ను సురక్షింతంగా బ‌య‌ట‌కు తీసుకురావాల‌ని కోరారు.. నిజామాబాద్‌ జిల్లా పర్యటనలో భాగంగా పట్టణంలోని పసుపు మార్కెట్‌ యార్డును నేడు సందర్శించారు. ఈ స‌మ‌యంలోనే ఎస్ ఎల్ బి సి ట‌న్నెల్ ప్ర‌మాద వార్త తెలియ‌డంతో స్పందిస్తూ, భ‌విష్య‌త‌లో ఇటువంటి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.. తాము అధికారంలో ఉండ‌గా ఎన్ ఎల్ బి సి ట‌న్నెల్ ప‌నుల‌ను కొన‌సాగించామ‌ని, అయితే ఎప్పుడు ఇటువంటి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌లేద‌ని పేర్కొన్నారు..

రేవంత్ జ‌ట్టు చంద్ర‌బాబు చేతిలో..

బనకచర్ల నుంచి మన నీటిని ఏపీ ఎత్తుకుపోతుంటే మూర్ఖపు ముఖ్యమంత్రి చూస్తూ నిలబడ్డారంటూ రేవంత్‌ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. తెలంగాణ హితం కోరితే చంద్రబాబు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డికి తెలంగాణ రైతుల కంటే చంద్రబాబుపై ఎక్కువ ప్రేమ ఉందా అంటూ ధ్వజమెత్తారు. రైతుల ఉసురు తీసి గోదావరి, కృష్ణా జలాలను ఇచ్చి చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా అని నిలదీశారు. . పసుపు రైతుల సమస్యలు, పసుపు ధరలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజాభవన్‌లో ఏపీ, తెలంగాణ సీఎంల సమావేశం తర్వాత బనకచర్ల ప్రాజెక్టు చేపడుతామని చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి బ్రీఫ్ చేసిన తర్వాత ఆయన ప్రకటన చేశారు. గోదావరి నది నుంచి 200 టీఎంసీలను తరలించడానికి ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. మన దగ్గరి నుంచి 200 టీఎంసీల నీటిని ఏపీ ఎత్తుకపోతుంటే మూర్ఖపు ముఖ్యమంత్రి చూస్తూ నిలబడ్డారు. బ్యాగుతో దొరికిన రేవంత్ రెడ్డి జుట్టు చంద్రబాబు చేతిలో ఉంది. అందుకే చంద్రబాబు ఎలా చెబితే సీఎం రేవంత్ రెడ్డి అలా నడుచుకుంటున్నార‌ని విమ‌ర్శించారు..

మ‌ద్ద‌తు ధ‌ర‌కు మంగ‌ళం …

పసుపునకు రూ.12 వేల కనీస ధర కల్పిస్తామని రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.. అంతకు తక్కువ ధర ఉంటే మిగితా డబ్బును బోనస్ రూపంలో ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింద‌ని అంటూ తక్షణమే పసుపుకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు క‌విత‌. పసుపు బోర్డుకు చట్టబద్ధత, కనీస మద్ధతు ధర కోసం కేంద్రంపై పోరాటం కొనసాగుతూనే ఉంటుంద‌ని పేర్కొన్నారు. దీన స్థితిలో ఉన్న పసుపు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల‌న్నారు. వ్యాపారులు రైతులను మోసం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నద‌ని మండి ప‌డ్డారు. మార్చి 1లోపు బోనస్ ప్రకటించకపోతే జిల్లా కలెక్టరేట్‌ను దిగ్భందిస్తాం’ అని హెచ్చరించారు.

సుప్రీం మొట్టికాయాలు వేసినా…

సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా సీఎం రేవంత్ రెడ్డి తీరు మారలేదని విమర్శించారు. తనపై మాట్లాడవద్దని సుప్రీం చివాట్లు పెట్టినా రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు తిట్టిన మొట్టమొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం తెలంగాణ ఖర్మ అన్నారు. అయినా విజ్ఞత లేకుండా ఆయన మాట్లాడుతున్నారని, ప్రజలు అన్నీ చూస్తున్నారని వెల్లడించారు. ఆయనలా మాట్లాడి తన స్థాయిని తగ్గించదలుచుకోవడం లేదన్నారు. నోరుందికదా అని ఎటుపడితే అటు మాట్లాడితే కుదరదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *