TG |ఇప్ప‌టికైనా క‌ళ్లు తెర‌వండి… కాళేశ్వ‌రం గొప్ప‌త‌నాన్ని గుర్తించండిః హ‌రీశ్ రావు

సిద్దిపేట : కాళేశ్వ‌రం తెలంగాణ వ‌ర‌ప్ర‌దాయిని అని.. కాళేశ్వరం కుంగింది అన్నవారికి, ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కండ్లు తెరవండి.. లేదంటే చరిత్ర మిమ్ములను క్షమించదు అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండలం చంద్లపూర్‌లోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును నేడు ఆయ‌న సంద‌ర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. రంగనాయక సాగర్‌లోకి కాలేశ్వరం పంప్ హౌస్‌ల ద్వారా నీటిని విడుదల చేసినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలో 50 వేల ఎకరాల్లో పంట సాగు అవుతుంది. పంట చేతికొచ్చే సమయానికి నీళ్లు లేకపోతే రైతులు ఇబ్బంది పడతారని విజ్ఞప్తి చేయగా, అనంతసాగర్ నుండి 1 టిఎంసి నీళ్లను రంగనాయక సాగర్‌కు పంపినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు. నా కోరిక మేరకు ఒక్క టిఎంసి నీటిని ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేశారని హ‌రీశ్‌రావు తెలిపారు.

గోరంతను కొండంత చేసి బీఆర్ఎస్‌పై బురదజల్లే ప్రయత్నం..



గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచిపెట్టాలని చూస్తుంది.. ప్రజలకు నష్టం చేయకూడదు. ఎస్సారెస్పీ స్టేజ్ 2లో తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట, భూపాలపల్లి ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఎస్సారెస్పీ నీరు తగ్గినప్పటికీ, కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగునీరు విడుదల చేశాం. కాళేశ్వరంలో 15 రిజర్వాయర్లు బాగున్నాయి, 23 కిలోమీటర్ల టన్నెల్స్‌ బాగున్నాయి, 19 సబ్ స్టేషన్లు బాగున్నాయి, 21 హౌసులు బాగున్నాయి, ప్రెజర్ మైన్లు బాగున్నాయి. మేడిగడ్డలో ఏడు బ్లాకులు ఉంటే, అందులో ఒక్క బ్లాక్‌లో ఒక్క పిల్లర్ మాత్రమే కుంగిపోయింది. కానీ గోరంతను కొండంత చేసి బీఆర్ఎస్‌పై బురదజల్లే ప్రయత్నం చేశారు. అధికారంలోకి వచ్చారు అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

పెండింగులో ఉన్న పంట కాలువల పనులు పూర్తి చేయాలి..


కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది. ఈ 15 నెలల్లో మేడిగడ్డ పిల్లర్లను బాగు చేసే తీరిక ప్రభుత్వానికి లేదు. నేడు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి.. ఆ నీళ్లను లిఫ్ట్ చేసి లక్షల ఎకరాల పంటను కాపాడే అవకాశం ఉంది. కేసీఆర్ మీద కోపంతోనే, బీఆర్ఎస్ మీద కోపంతోనే, తెలంగాణ రైతులకు అన్యాయం చేయకూడదని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ ప్రాంతంలో 500-1000 ఫీట్ల బోర్లు వేసినా నీళ్లు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు రంగనాయక సాగర్ కింద, అనంతసాగర్ కింద, మల్లన్న సాగర్ కింద పండే పంట కాలేశ్వరం పంట కాదా? కళ్లు ఉండి కల్లు లేని కబోధుల్లా.. చెవులు ఉండి చెవిటివాళ్లలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. పెండింగులో ఉన్న పంట కాలువల పనులు పూర్తి చేయాలి. రైతులతో పాటు మత్స్య సంపద కూడా పెరిగి, మత్స్యకారులకు ఆదాయం వస్తుంది. అన్ని వర్గాలకు మంచిచేసే ఇలాంటి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయకూడదు అని హ‌రీశ్‌రావు సూచించారు.

ఇప్పటికైనా కేసీఆర్‌ గొప్పతనం కాంగ్రెస్‌కు అర్థం కావాలి

కేసీఆర్ కృషి ఫలితం.. సీతారామా ప్రాజెక్టు, నెర్రెలు బాసిన సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. నాడు సీతారామ ప్రాజెక్టును వ్యతిరేకించిన కాంగ్రెస్.. అప్పట్లో అనుమతులు రాకుండా కోర్టుల్లో కేసులు వేశారని అన్నారు. కానీ నేడు కాంగ్రెస్ మంత్రులు, నాయకులు మాత్రం గోదావరి జలాల వద్ద ఫోటోలకు ఫోజులిస్తున్నారని విమర్శించారు. తిట్టడం తప్ప.. కట్టడం రాని కాంగ్రెస్‌కు, కేసీఆర్ గొప్పతనం ఇప్పటికైనా అర్థం కావాలని అన్నారు. ఈ ప్రాజెక్టుతో ఒక్క ఎకరాకు నీరు రాదు అన్నోళ్ళు, ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

కృష్ణా జ‌లాలు.. తెలంగాణ హ‌క్కు

కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి హక్కులను కాపాడలేని కాంగ్రెస్ చేతగానితనం వల్ల సాగర్ ఆయకట్టుకు కరువు వచ్చిందని హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల రోజుకు పదివేల క్యూసెక్కుల కృష్ణ జలాలను ఆంధ్ర తరలించుకుపోతున్న పరిస్థితి అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో రైతులను ఆదుకునేందుకు ఏకైక మార్గం గోదావరి జలాలను ఒడిసి పట్టి, ఎత్తిపోయడమే అని తెలిపారు. దీన్ని ముందే అంచనా వేసిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *